ఏపీలో సీఐడీ అధికారులు అత్యుత్సాహానికి పోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా టీడీపీ దివంగత సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు.. అల్లుడు.. రాజమండ్రి సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసును సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదిరెడ్డి ఇంటికి వచ్చిన సీఐడీ బృందం..ఆరున్నర గంటల సమయంలో తండ్రీ కుమారులను అదుపులోకి తీసుకుని రాజమండ్రి ప్రాంతీయ సీఐడీ కార్యాలయానికి తరలించారు.
ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం రాజమహేంద్రవరంలో `జగత్ జనని` చిట్స్ నిర్వహిస్తోంది. జగత్ జనని చిట్స్కు సంబంధించి నెలరోజుల క్రితం సీఐడీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ తర్వాత ఈ కేసులో ఎలాంటి అరెస్టులు కాకుండా కోర్టు నుంచి ముందస్తు ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు. అయినా సీఐడీ పోలీసులు ప్రాంతీయ కార్యాలయానికి వీరిని తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వీరిని ఎందుకు అదుపులోకి తీసుకున్నారో సీఐడీ అధికారులు ప్రకటించలేదు.
ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు ఆదిరెడ్డి వాసులను అదుపులోకి తీసుకున్న విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్దఎత్తున సీఐడీ కార్యాలయం వద్దకు తరలివచ్చారు. మే నెల 27, 28 వ తేదీల్లో తెలుగుదేశం మహానాడు కార్యాక్రమాన్ని రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లును ఆదిరెడ్డి వాసు చూస్తున్నారు. కక్షపూరితంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. గతంలో ఇచ్చిన నోటీస్కి సమాధానం ఇచ్చామని… ఆదిరెడ్డి తరఫు న్యాయవాది తెలిపారు. ముందస్తు అరెస్ట్ చేయకూడని హైకోర్టు నుంచి ఆర్డర్ ఉందని ఆయన స్పష్టం చేశారు.
జగన్ డైవర్షన్ పాలిటిక్స్: నారా లోకేష్
ఆదిరెడ్డి కుటుంబాన్ని సీఐడీ అదుపులోకి తీసుకోవడం జగన్ స్టైల్ డైవర్షన్ డ్రామా అని టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ విమర్శించారు. ఫిర్యాదులు లేని కేసుల్లో టీడీపీ బీసీ నేతలైన మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులని అదుపులోకి తీసుకోవడం, A-1 దొంగ పాలనలోనే సాధ్యమని మండిపడ్డారు. వైసీపీలో చేరలేదనే అక్కసుతో…. బీసీ నేతలైన ఆదిరెడ్డి కుటుంబంపై కక్షకట్టడం దారుణమన్నారు. ఆదిరెడ్డి కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని లోకేశ్ స్పష్టం చేశారు.