ఏటా మే 28న అన్నగారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న మహానాడుకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. వచ్చేనెల మే 27, 28 తేదీల్లో రాజమండ్రిలో మహానాడు నిర్వహిస్తామని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రకటించారు. 27న 15 వేల మందితో ప్రతినిధుల సభ, 28న భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఈసారి మహానాడుకు 2 చోట్ల వేదికలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు.
15 కమిటీలతో ముమ్మర ఏర్పాట్లు
మహానాడు నిర్వాహణ కోసం 15 కమిటీలు నియమించామని, రెండు రోజుల్లో కమిటీలను ప్రకటిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. మే 28న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు.. 15 లక్షల మంది హాజరవుతారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఎన్నికలు ఏడాది కాలంలో రానున్న నేపథ్యంలో రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల పట్టభద్రులు, ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరస విజయాలు సాధించి, మంచి జోష్ మీద ఉన్న టీడీపీ.. మహానాడు నుంచే ఎన్నికల శంఖం పూరించే అవకాశం కనిపిస్తోంది.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు రాజకీయ కేంద్రంగా ఉన్న రాజమహేంద్రవరంలో సభ అంటే టీడీపీకి శుభమేననే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. గోదావరి జిల్లాలో టీడీపీకి కంచుకోట వంటివి. గత ఎన్నికలలో ఎక్కువ చోట్ల ఓడినా కేడర్లో ఎక్కడా ఆత్మస్థయిర్యం తగ్గలేదు. మరింత పట్టుదల పెరిగింది. అంతేకాక జనసేనతో కూడా కలిసి పయనించే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం జరుగుతుండడం వల్ల కూడా మహానాడుకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. మహానాడుకు సుమారు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు.