ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు వద్ద.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ పోల వరం ప్రాజెక్టుకు సంబంధించి టైల్ బండ్(ప్రాజెక్టు బలంగా ఉండేలా వేసిన కట్ట).. కుంగిపోయింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం 81 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అయితే.. ఇది వేసిన కొన్ని నాళ్లకే కుంగిపోయింది. అయితే.. ఈ విషయాన్ని ప్రబుత్వం అత్యంత గోప్యంగా ఉంచింది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్.. పోలవరంలో పర్యటించారు. కానీ,ఈ విషయాన్ని మాత్రం ఆయన ఎక్కడా బయట పెట్టలేదు.
అదేసమయంలో మంత్రి అంబటి రాంబాబు కూడా.. పోలవరం ప్రాంతంలో పర్యటించి వచ్చారు. ఆయన కూడా ఈ విషయాన్ని మరుగు పరిచే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు అసలు అక్కడ ఏం జరుగుతోందనే విషయాన్ని పరిశీలించేందుకు శనివారం ఉదయం బయలు దేరి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడుగడుగునా అడ్డుకుని.. అరెస్టు చేశారు. ఏలూరు నుంచి గోపాలపురం మీదుగా పోలవరం బయలుదేరిన టీడీపీ నేతలను కొవ్వూరుపాడు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, పార్టీ నేతలను పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలో పోలీసులను దాటుకొని మాజీ మంత్రి దేవినేని పోలవరం బయలుదేరారు. అయితే, ఆయనను జీపులో ఫాలో అయిన పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు టీడీపీ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు టీడీపీ నేతలు పోలవరం వస్తున్నారనే సమాచారంతో అడ్డుకోవడానికి పోలవరం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో పోలవరం వద్ద టెన్షన్ పూరిత వాతావరణం నెలకొనడం గమనార్హం.