అక్రమాస్తులు, అవినీతి ఆరోపణలు, క్విడ్ ప్రోకో కేసుల్లో జగన్ ఏ1 అయితే…విజయసాయి ఏ2 అని విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో వీసా రెడ్డి దిట్ట అని, అందుకే ఆయనను జగన్ వెంటేసుకొని తిరుగుతుంటారని ప్రతిపక్ష నేతలు దుయ్యబడుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్, విజయసాయిలపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
దేశంలోనే అత్యధికంగా అప్పులున్న రాష్ట్రంగా ఏపీ కీర్తి సంపాదించిదని ఎద్దేవా చేశారు. ఏపీలో ఆర్థిక ఉగ్రవాదాన్ని చూసి ఆర్బీఐ నిబంధనలు కఠినతరం చేసిందని తెలిపారు. కార్పొరేషన్లకు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన గ్యారింటీని క్రైటీరియాగా తీసుకుని అప్పులు ఇవ్వడానికి వీల్లేదని ఆర్బీఐ చెప్పిన విషయాన్ని పట్టాభి గుర్తుచేశారు. రాష్ట్ర బడ్జెట్ అవసరాల కోసమే ఏపీఎస్ డీసీ అంటూ జీవో 80 విడుదల చేశారని, జీవో 80 జారీ ఆర్బీఐ మార్గదర్శకాల ఉల్లంఘనేనని పట్టాభి పేర్కొన్నారు.
సూట్ కేస్ కంపెనీలు పెట్టడంలో జగన్, విజయసాయిరెడ్డిలను మించినవారెవరూ లేరని షాకింగ్ కామెంట్లు చేశారు. బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు సూట్ కేస్ కంపెనీలను జగన్ , విజయసాయిలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఏపీఎస్డీసీ పేరుతో కంపెనీని ఏర్పాటు చేసి బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్ల రుణాలను కొల్లగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు. కార్పొరేషన్ల పేరుతో డబ్బులు తెచ్చి, వాటిని దారి మళ్లించి, అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
కార్పొరేషన్ల పేరుతో జగన్ చేస్తున్న అప్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆందోళన వ్యక్తం చేసిందని గుర్తు చేశారు. జగన్ అండ్ కో అవినీతికి పాల్పడుతోందని తాము ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నామని చెప్పారు. అయితే, తమలాగే ఇప్పుడు ఆర్బీఐ కూడా ఆందోళన వ్యక్తం చేసిందని చెప్పారు. రూ. 25 వేల కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ కోసం ఇచ్చిన జీవో నెంబర్ 92 కూడా ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని అన్నారు.