టీడీపీ నేత పట్టాభికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరైంది. శనివారం హైకోర్టులో పట్టాభి బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు పట్టాభి బెయిల్ మంజూరు చేసింది. సీఎంను అసభ్య పదజాలంతో దూషించినందువల్లే విధ్వసం జరిగిందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు.
పట్టాభి చేసిన వ్యాఖ్యల సీడీని న్యాయమూర్తికి ప్రభుత్వ న్యాయవాది ప్లే చేసి చూపించారు. సీఎంను అసభ్య పదజాలంతో దూషించారని, అసభ్య పదజాలంతో దూషించడంతోనే విధ్వంసకాండ జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేసే పక్రియను పోలీసులు అమలు చేయలేదని న్యాయస్థానం పేర్కొంది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సెక్షన్ 41 ఏ నోటిసులపై పోలీసులు కింది కోర్టు సూచనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది.
పోలీసులు పట్టాభి అరెస్టులో సరైన విధానాన్ని అమలు చేయలేదని, రిమాండ్ రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాలకు సెక్షన్ 41 ఏ నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలని, ఈ కేసులో అమలు జరగలేదని పట్టాభి తరపు న్యాయవాది పోసాని వాదించారు.
నేరం ఎవరికి వ్యతిరేకంగా జరిగినా ఒకే విధానం ఉంటుందని, వ్యక్తులు, పదవులను బట్టి విధానాలు మారవని న్యాయవాది పోసాని కోర్టుకు తెలిపారు.
సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యల కేసులలో రెండు రోజుల క్రితం పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై క్రైం నం.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్విత్ 120(బి) సెక్షన్ల కింద గవర్నరుపేట పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
పట్టాభిని అరెస్ట్ చేసిన తర్వాత మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. అనంతరం నిన్న ఆయనను భద్రతా కారణాలరీత్యా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం పట్టాభి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.