సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులు..ఆఖరికి టీడీపీ షేర్ చేసిన పోస్టును షేర్ చేసిన సీనియర్ జర్నలిస్టులు సైతం వేధింపులకు గురవుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ కార్యాలయాలు, నేతలపై వైసీపీ శ్రేణులు దాడులు చేయడం…తిరిగి టీడీపీ నేతలపైనే తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు బనాయించడం పరిపాటిగా మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇటీవల పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో జరిగిన మారణహోమం నేపథ్యంలోనే ఈ విషయం మరోసారి ప్రూవ్ అయింది. మాచర్ల ఎపిసోడ్ లో పోలీసుల వ్యాఖ్యలు వింటుంటే…ఖాకీలు జగన్ ప్రభుత్వానికి ఏ రేంజ్ లో ఊడిగం చేస్తున్నారో అర్థమవుతోందని మాజీమంత్రులు నక్కా ఆనంద్ బాబు, కొల్లు రవీంద్రలు ఆరోపించారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ’ కార్యక్రమం సక్సెస్ అయిందని, అది చూసి ఓర్వలేకే మాచర్ల కేంద్రంగా జగన్, పిన్నెల్లి కుట్రలకు తెరలేపారని ఆరోపించారు.
సెక్షన్లు, నిబంధనలు టీడీపీవారికే వర్తిస్తాయా? వైసీపీవారికి వర్తించవా అని నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. మాచర్లలో దాదాపు 3 గంటలు మారణహోమం జరిగితే, 2 సీసీటీవీ పుటేజ్ లతో, తప్పంతా టీడీపీదేనని ఎలా నిర్ధారిస్తారని ఆయన ప్రశ్నించారు. ఫ్యాక్షన్ తగాదాలే మాచర్లలో గొడవకు కారణమని ఎస్పీ అడ్డగోలుగా మాట్లాడారని, అక్కడ ఫ్యాక్షన్ సమసిపోయి 20 ఏళ్లు దాటిందన్న సంగతి ఆయనకు తెలీదా అని నిలదీశారు. వైసీపీ వారిని ఎస్పీ సమర్థిస్తూ బ్రహ్మారెడ్డిపై హత్యాయత్నం కేసుపెట్టారని, కానీ, ఎమ్మెల్యే సోదరుడిపై ఎందుకు కేసు పెట్టలేదు? తురకా కిశోర్, ఇతర వైసీపీ నేతలు, కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు పెట్టలేదు? అని నిలదీశారు.
ఆత్మరక్షణకోసం ప్రతిఘటించిన వారు నేరస్థులా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. “మా నాన్నకు, నాకు ఉన్న ఫ్యాక్షన్ స్వభావం నా కొడుక్కి వచ్చిందని గతంలో రాజశేఖర్ రెడ్డి అన్నారని, ఆ మాటలను ఇప్పుడు జగన్ నిజం చేస్తున్నాడని అన్నారు. రెండు దశాబ్దాలుగా ప్రశాంతంగా ఉన్న పల్నాడులో వైసీపీ వచ్చిన తర్వాత రక్తపుటేరులు పారాయని, చంద్రయ్యతోపాటు పల్నాడువ్యాప్తంగా 16మంది టీడీపీనేతల్ని జగన్ రెడ్డి బలితీసుకున్నాడని అన్నారు. ఏం ప్రమాణంచేసి, ఒంటిపై ఖాకీ దుస్తులు వేసుకున్నారో పోలీసులు చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.