గుంటూరు జిల్లా పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి శివాలయం క్యాంటీన్ వద్ద మాంసం కూర కనపడిన ఘటన ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఆ ఘటన తర్వాత క్యాంటీన్‌ను సీజ్ చేసి, నిర్వాహకుల లైసెన్స్‌నూ అధికారులు రద్దు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పవిత్రమైన దేవాలయం క్యాంటీన్ వద్ద మాంసం కనబడడంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రపై దేవాదాయ శాఖ మండిపడ్డారు.
అంతేకాదు, ఆలయ ఈవో కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో, ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం, అనుమతి లేకుండా కార్యాలయానికి రావడం వంటి కారణాలతో ధూళిపాళ్లపై పోలీసులకు దేవాదయ శాఖ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నేడు ధూళిపాళ్ల నరేంద్రతో పాటు 92 మందిపై కేసులు నమోదు చేశారు. దీంతో, ధూళిపాళ్ల అరెస్టుకు నిరసగా టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుతో కొద్ది సేపు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
మరోవైపు, ఈ వివాదంపై బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. పెదకాకాని ఘటనను నిరసిస్తూ గుంటూరులోని దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయం దగ్గర ఆందోళనకు దిగారు. అయితే, డీసీ కార్యాలయం లోపలకు బీజేపీ నేతలు వెళ్లకుండా గేట్లు మూసేశారు. ఆ తర్వాత వారిని లోపలకు అనుమతించినా డిప్యూటీ కమిషనర్ బయటకు రాకపోవడంపై బీజేపీ నేతలు మండిపడ్డారు.
డీసీ తీరు సరిగా లేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలను పోలీసులు బయటకు పంపారు. ఈ ఘటనలో కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసి, డీసీని సస్పెండ్ చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.