ఉత్తరాంధ్రలో ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ నేతలు నేటి నుంచి పోరుబాటకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రుషికొండలో అక్రమాలపై నిరసనలు తెలిపేందుకు టిడిపి నేతలు పిలుపునిచ్చారు. దీంతో, ఎక్కడికక్కడ టిడిపి నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. బుద్ధా వెంకన్న, గౌతు శిరీష వంటి నేతలను పోలీసులు నిర్బంధించారు. అంతేకాదు, నిరసన తెలిపేందుకు విశాఖ వస్తున్న పొరుగు జిల్లాల నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఇక, విశాఖలోని టిడిపి నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం సంచలనం రేపుతోంది. మరికొందరు నేతలను పోలీసులకు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడంతో టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే నిరసన తెలిపేందుకు వెళ్తున్న టిడిపి నేతల అరెస్టులను ఖండిస్తూ టిడిపి రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పలనాయుడు నిరసనకు దిగారు. ఈ నిరసనలో భాగంగా అప్పలనాయుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వెరైటీగా నిరసన తెలిపారు.
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే నేలపై పడుకొని అప్పలనాయుడు నిరసన వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారాన్ని రికార్డు చేసిన అప్పలనాయుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ అయింది. ఏది ఏమైనా విశాఖలో టిడిపి నేతల అరెస్టుల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.
దీంతో, పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవడంపై ఏపీ టీడీపీ చీఫ్ కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్నారని, ఆ దోపిడీ వ్యవహారాలు బయటపడిపోతాయనే తమ పోరుబాట కార్యక్రమాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో జె-గ్యాంగ్ దోపిడీని బట్టబయలు చేసేందుకు బయలుదేరిన తమ నేతలను అడ్డుకోవడం అప్రజాస్వామికమని అన్నారు.
ఈ అక్రమ అరెస్టు ఖండిస్తూ 3 town police పోలీస్ స్టేషన్ బయట నేలపై పడుకొని నా నిరసన తెలియజేస్తున్నాను. pic.twitter.com/wT9uyzMgK3
— Bandaru Appala Naidu (@BandaruTDP) October 28, 2022