రాష్ట్రంలో పార్టీలు మారిన వారికి భవితవ్యం కష్టమేనా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతం లో వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారి.. అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి వచ్చారు. అయితే.. వీరిలో ఒక్కరు మాత్రమే (గొట్టిపాటి రవి) గెలుపు గుర్రం ఎక్కారు. మిగిలిన వారికి భవిష్యత్తు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ వీరికి ఎదురు గాలి వీస్తోంది. ఇదిలావుంటే.. గత ఎన్నికల తర్వాత.. టీడీపీ తరఫున గెలిచిన 23 మందిలో నలుగురు పార్టీ మారిపోయారు.
అధికారికంగా.. టీడీపీలో ఉన్నప్పటికీ.. అనధికారికంగా వారు వైసీపీ తరఫునే వాయిస్ వినిపిస్తున్నారు. వీరిలో .. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి కీలకంగా ఉన్నారు. ఇక, కృష్నా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, విశాఖ జిల్లా వెస్ట్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, గుంటూ రు జిల్లాపశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌లు టీడీపీ నుంచి బయటకు వచ్చారు. అయితే.. వీరిలో ఏ ఒక్కరి కీ ఇప్పుడు.. ప్రాధాన్యం లేకుండా పోయింది. ఎందుకంటే.. వచ్చే ఎన్నికల్లో వీరికి టికెట్ లభించడం.. వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం లభించే ఛాన్స్ లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో ఇప్పుడు ఏం చేయాలనే విషయంవీరికి ఇబ్బందిగా మారింది.
మరోవైపు.. వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల్లో వైసీపీ నాయకులు ఎవరూ కూడా వీరికి అండగా నిలబడడం లేదు. పైగా అంతర్గత పోరు ఎక్కువగా ఉంది. వైసీపీకి అన్ని విధాలా అండగా ఉన్నామని.. ఆయా నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఓడిపోయిన..వారు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమకే టికెట్లు ఇస్తారని.. మీరు ఇక్కడితో తట్టాబుట్టా సర్దు కోవాల్సిందే నని తెగేసి చెబుతున్నారు. దీంతో జంపింగులకు కంటిపై కునుకు లేకుండా పోయింది. నిజానికి ప్రభుత్వంలో ఉంటే..ఏదొ ఒక పదవి అయినా.. వస్తుందని ఆశించారు. అదేసమయంలో ఆర్థికంగా కూడా తమకు ఇబ్బందులు తగ్గుతాయని అనుకున్నారు.
కానీ. . పదవులు రాలేదు. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో వీరికి ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. అయితే.. వారిపై కేసులు ఉంటే మాత్రం ఆ ఒక్కటే వారికి ఉపశమనంగా ఉంది. అంతే తప్ప.. మిగిలిన విషయాల్లో ముఖ్యంగా రాజకీయంగా ఎలాంటి సౌకర్యాలు కనిపించడం లేదు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అయినా.. నెంబర్ 2 నాయకులుగానే చలామణి అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వీరు తర్జన భర్జన పడుతున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వ్యతిరేక గాలి వీస్తోందనే అంచనాలు వస్తున్న నేపథ్యంలో ఈ పార్టీలో ఉండి తప్పు చేశామా? అనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా చీరాలలో ఎమ్మెల్యే కరణంమరింత గా ఫీలవుతున్నారు. తన కుమారుడిపై ఆశతో పార్టీలో కి వస్తే.. ఆయనకు ఇక్కడ ఆమంచి వర్గం కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. ఇలా.. మొత్తంగా రాష్ట్రంలో జంపింగులకు భవిష్యత్తు కనిపించకుండా పోయిందనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.