టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు తగ్గడం లేదు. ఎక్కడికక్కడ ఎవరికివారే హీరోలుగా చలామణి అవుతు న్నారు. ముఖ్యంగా బలమైన తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. ఇటీవల రాజాన గరంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘బంగారం లాంటి నియోజకవర్గాన్ని పాడు చేశావ్, అధికారంలో ఉండగా అనుభవించి ఇప్పుడు గాలికొదిలేస్తావా?’ అని చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ.. ఎందుకో కానీ, పెందుర్తి పుంజుకోలేదు. మరోవైపు.. ఆయనను పార్టీ నుంచి పక్కన పెట్టాల నే వాదన బలంగా వినిపిస్తోంది. ఇక, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంపై ఇప్పటికీ ఆశ తగ్గక పోవడంతో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుతో విభేదాలు కొనసాగుతున్నాయి. సిటీలో ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీ సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ మూడో వర్గం ఏర్పాటు చేసుకుని.. చక్రం తిప్పుతున్నారు.
గోపాలపురం నియోజకవర్గం ఇన్చార్జిని మారుస్తూ.. చంద్రబాబు ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. ఈ మా ర్పును జీర్ణించుకోలేక కొందరు నేతలు వివాదాలకు దిగుతున్నారు. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటే శ్వరరావును పక్కన పెట్టి మద్దిపాటి వెంకటరాజుకు బాధ్యతలు అప్పగించడంతో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. వెంకటేశ్వరరావుకు జెడ్పీ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మద్దతుగా నిలిచారు.
ఈ నేపథ్యంలో ముప్పిడి, వెంకటరాజు మధ్య తాడేపల్లిగూడెంలో జరిగిన పార్టీ జిల్లా సమావేశంలో వైషమ్యాలు రచ్చకెక్కి చివరకు ఆ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరింది. బాబు సైతం వెంకటరాజుకు మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఇక, అత్యంత కీలకమైన,ప్రస్తుతం హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీని గ్రూపు తగదాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి.
మాజీ మంత్రి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు కేఎస్ జవహర్ కొవ్వూరులోనే ఉంటున్నా స్థానికంగా నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఇక్కడి నాయకులు చక్రం తిప్పుతున్నారు. దీనికి కారణం.. ఎస్సీలకు రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం నుంచి ద్విసభ్య కమిటీని నియమిస్తూ.. ఇటీవల చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. దీనిని జవహర్ వర్గం వ్యతిరేకిస్తోంది. దీంతో ఇక్కడ పార్టీ పుంజుకునేందుకు అవకాశం ఉన్నా.. నాయకులు చేజేతులా వదులుకుంటున్నారని పరిశీలకులు అంటున్నారు.