ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బలహీన నాయకుడని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం జరిగిన పార్టీ వ్యూహ కమిటీ సమావేశంలో చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడారు.
మంత్రివర్గ విస్తరణలో పార్టీ నేతల ఒత్తిడి వ్యూహాలకు జగన్మోహన్ రెడ్డి తలొగ్గారన్నారు. ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేసిన వారికి జగన్ కేబినెట్ పదవులు ఇచ్చారన్నారు. బ్లాక్ మెయిల్ చేసిన నేతలకు బెర్త్ ఇచ్చారని జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై అధికార పార్టీ నేతలు కూడా మాట్లాడుతున్నారని ఆరోపించారు. పార్టీ నేతలు జగన్పై తిరగబడుతున్నారని, జగన్మోహన్రెడ్డిపై తిరుగుబాటు చేయడానికి ఎక్కువ సమయం పట్టదన్నారు.
మొత్తానికి వైసీపీ లుకలుకలు టీడీపీ నాయకత్వానికి సంబరాన్ని కలిగించినట్టున్నాయి. ఎపుడైనా శత్రువుపై మనం గెలవాలి అనుకోవాలి. ఏదో విధంగా శత్రువు బలహీనపడాలని కోరుకోకూడదు. టీడీపీ పదేపదే చేసే మిస్టేక్ ఇదే. సుకుమార్ రంగస్థలం సినిమాలో హీరో క్యారెక్టర్ ను టీడీపీ స్ఫూర్తిగా తీసుకోవాలి.
ఆ సినిమాలో తప్పు చేసిన ఓ రాజకీయ నాయకుడు ప్రమాదంలో చావు అంచులకు వెళ్తాడు. అతనికి హీరో 4 నెలలు సపర్యలు చేసి బతికిస్తాడు. తీరా చూస్తే అతను బతికించింది ప్రేమతో కాదు… తన పగ తీరకుండా అతను చావకూడదని తనే సేవలు చేసి బతికించి మరీ తప్పు చేసిన వాడికి తన తప్పును చెప్పి.. అపుడు చంపి పగ తీర్చుకుంటాడు. ఇది బలవంతుడు చేయాల్సిన పని.
తన పార్టీ ఎదగాలంటే తన పార్టీ ఎదగాలి, ఎదిగేలా చేయాలి. అంతేగాని ప్రత్యర్థి తనంతట తాను చేసిన తప్పుల వల్ల వెనుకపడితే మనకు దక్కేది గెలుపు కాదు, ఒక కాల పరిణామం. ఇది పార్టీకి మేలు చేయదు. ఈ విషయాన్ని తెలుగుదేశం అధిష్టానం కచ్చితంగా తెలుసుకుని తీరాలి. లేకపోతే జగన్ వంటి విచారణ ఖైదీల చేతిలో కూడా మళ్లీ మళ్లీ ఓటముల పాలు కావల్సి వస్తుంది. జగన్ ఓడిపోవడం కాదు కావల్సింది… టీడీపీ గెలవడం కావాలి. టీడీపీ స్వయంకృషితో గెలిస్తే క్యాడర్ బలపడుతుంది. భవిష్యత్తు బాగుంటుంది. లక్ వద్దే వద్దు. టీడీపీ శాశ్వతంగా బలపడాలంటే కావల్సింది అదృష్టం కాదు సమయస్ఫూర్తి, కార్యాచరణ, వేలెత్తిచూపలేని రాజకీయ వ్యూహాలు.