టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. టీడీపీ హయాంలో ఎమ్మార్వో వనజాక్షి ఎపిసోడ్ లో చింతమనేని తీరుపై సర్వత్రా విమర్శలు రావడం, ఆ తర్వాత కూడా టోల్ గేట్ వ్యవహారంలో ఆయన ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తడం అప్పట్లో సంచలనం రేపాయి. స్వతహాగానే ముక్కుసూటి మనిషి అయిన చింతమనేనికి ఈ రెండు ఎపిసోడ్ లు కొద్దిగా ఇబ్బంది పెట్టాయి. ఆ తర్వాత వైసీపీ హయాంలో చింతమనేనిపై కొన్ని కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా… 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత చింతమనేని కాస్త లో ప్రొఫైల్ మెయింటెన్ చేస్తున్నారు. అడపాదడపా తప్ప మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చింతమనేని…. టీడీపీ అధినేత చంద్రబాబుపై షాకింగ్ కామెంట్లు చేశారు. తన నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చంద్రబాబు పెద్ద తప్పు చేశారని, ఆనాడు ఆయన చేసిన తప్పుల వల్ల తాము అప్పుల పాలయ్యామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అడగకుండానే ప్రజలకు సౌకర్యాలు కల్పించరని, సిమెంటు రోడ్లు వేయించారని, అయితే, జనం అడగకుండానే అలా చేయడమే చంద్రబాబు చేసిన తప్పని చింతమనేని అన్నారు. ఆకలి వేసిన వాడికి అన్నం పెడితేనే వాడికి ఆ విలువ తెలుస్తుందని, ఆకలి వేయనివాడికి కూడా అన్నం పెడితే అతి అవుతుందని అన్నారు.
ఆ తరహాలోనే చంద్రబాబు జనానికి మంచి చేసి…చివరకు చెడ్డ అయ్యారని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ను డెవలప్ చేసి నంబర్ వన్ గా నిలపాలని చంద్రబాబు కలలు కన్నారని, కానీ, ఆ కలలను ప్రజలు చూడలేకపోయారని వాపోయారు. రోడ్లు వేస్తుంటే టీడీపీ నేతలకు వాటాలున్నాయని ప్రజలు అనుకున్నారని, అడగకుండానే రోడ్లు వేసేసరికి జనాలు ఆరకంగా తప్పుగా అర్థం చేసుకొని పార్టీని ఓడించారని చెప్పారు.
ఆనాడు కాంట్రాక్టర్ మార్జిన్ లేకుండానే చంద్రబాబు ఎస్టిమేషన్లు వేయించి రోడ్లు నిర్మించాలని కాంట్రాక్టర్లకు చెప్పారని, ఆయన మీద గౌరవంతో కాంట్రాక్టర్లు కూడా అలాగే చేశారని అన్నారు.
అయితే, అలా చేయడం వల్ల పార్టీకి, నేతలకు, కాంట్రాక్టర్లకు మంచిపేరు వస్తుందని చంద్రబాబు భావించారని, కానీ, అలా చేసిన పనులకు ఇప్పటికీ బిల్లులు రాకపోవడంతో చాలా నష్టపోయారని అన్నారు. ఇప్పటికీ 75 శాతం నిధులు రావాల్సి ఉందని, జగన్ హయాంలో బిల్లులు రాకపోవడంతో ఆస్తులు అమ్మి అప్పులపాలయ్యారని వాపోయారు. అలా కాంట్రాక్టర్లు, నేతలు ఆర్థికంగా దెబ్బతిని…పార్టీకి కూడా నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. తనపై జగన్ కావాలనే కేసులు పెడుతున్నారని., తన గురించి అన్నీ తెలిసిన మీడియా కూడా లేనిపోనివి ప్రచారం చేసి…తనను క్రిమినల్ మాదిరిగా చిత్రీకరించిందని వాపోయారు.