తన వ్యాఖ్యలతో, వ్యవహార శైలితో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. పశ్చిమగోదావరి టీడీపీ కీలక నేతగా పేరున్న చింతమనేని….పలు ఘటనల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనానికి తెరలేపారు. తాజాగా మరోసారి అదేతరహాలో చింతమనేని చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన, బీజేపీ అభ్యర్థుల తరఫున తాను ప్రచారం చేస్తానంటూ చింతమనేని చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి.
ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల పరిణామాల తీరుపై చింతమనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ కొందరు టీడీపీ అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంపై చింతమనేని మండిపడ్డారు. కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేస్తున్నారని, పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నడివిజన్లలో జనసేన, బీజేపీ అభ్యర్థులుంటే వారి తరుపున ప్రచారం చేస్తానని చింతమనేని ఆవేశపూరిత ప్రకటన చేశారు.
చింతమనేని ప్రకటనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ నేత చింతమనేని ప్రభాకర్ జోక్యం చర్చనీయాంశంగా మారింది. పార్టీలో అంతర్గత సమస్యలపై చంద్రబాబుతో చర్చించాలని, అలా కాకుండా సొంతగా బీజేపీ, జనసేనల తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించడంపై ఏలూరు టీడీపీ కార్యకర్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీని దీటుగా ఎదుర్కోవాల్సిందేనని, అందుకని, బీజేపీ, జనసేనల అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తాననడం సరికాందటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీ పరువు బజారున పడుతుందని, వైసీపీ, జనసేన, బీజేపీలకు టీడీపీ, టీడీపీ నేతలు, కార్యకర్తలు అంటే పలుచన భావం కలుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఈ వ్యవహారంపై చంద్రబాబు స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.