తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ ద్వారా మరో ఎనిమిది మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారు.
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం ఇక్కడ ఉండవల్లిలోని తన నివాసంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు.
అమెరికా కేంద్రంగా పనిచేసే ఇంటెల్లీసాఫ్ట్ కంపెనీలో ఇండియాలోని తమ స్థానిక కార్యాలయాల నుంచి పని చేసే నిమిత్తం ఉద్యోగాలు పొందిన ఈ విద్యార్థులను చంద్రబాబునాయుడు అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముచ్చటించి శిక్షణ విషయాలను అడిగి తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ ఎంపవర్మెంట్ సెంటర్ మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆయన ఆకాంక్షించారు.
ఎన్ఆర్ఐ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ వేమూరు రవికుమార్, టిడిపి బ్రాహ్మణ సాధికారత సంస్థ కో ఆర్డినేటర్ కె బుచ్చిరాంప్రసాద్, ఎంపవర్మెంట్ సెంటర్ అడ్మినిస్ట్రేషన్ విభాగం డివి రావు, వి బిందు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.