టీడీపీలో ఏది కావాలన్నా..ఏం జరగాలన్నా.. పెద్దాయన చంద్రబాబు ముందుకు రావాల్సిందే. ఇది ఇలా చేయండి. అని చెబితే.. అల్లుకుపోయే నాయకులు కూడా లేకపోవడంతో.. అన్నీ తానై ముందుకు నడిపించాల్సిందే. ఇదీ.. ఇప్పుడు టీడీపీలో ఉన్న పరిస్థితి. ఇటీవల చంద్రబాబు పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి నేపథ్యంలో దీక్షకు దిగారు. అయితే….దీక్షకు సంబంధించి.. ఆయన ప్రకటన చేయగానే.. మేం అంతా చూసుకుంటాం.. అని చెప్పిన నాయకులు ఒక్కరు కూడా కనిపించలేదు. అంతేకాదు దీక్షకు ఏమేం చేయాలో కూడా చంద్రబాబు నుంచి అన్ని తెలుసుకున్నవారే ఎక్కువగా ఉన్నారు.
ఇంకొందరు సీనియర్లు కూడా.. దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించాల్సింది పోయి.. దీక్ష ప్రారంభమైన తర్వాత.. చుట్టపు చూపుగా వచ్చి.. వెళ్లిపోయారు. మరికొందరు.. దీక్ష చివరిలో వచ్చి హాజరు వేయించుకున్నారు. అంతేతప్ప.. అత్యంత కీలకమైన దీక్ష విషయంలో ఏర్పాట్ల నుంచి ముగింపు వరకు ఒక్కరంటే .. ఒక్కరు కూడా వచ్చి.. సలహాలు ఇచ్చింది కానీ.. పర్యవేక్షించింది కానీ లేదట. మొత్తం అంతా.. చంద్రబాబు చూసుకున్నారని.. పార్టీలోనే చర్చ నడిచింది. ఇక, ఉప ఎన్నికల విషయంలోనూ ఇలానే ఉంది ..పరిస్థితి. ఎవరికైనా బాధ్యతలు అప్పగించి.. తాను దూరంగా ఉందామంటే.. కుదరడం లేదని బాబు వాపోతున్నారు.
వైసీపీలో కొందరు నాయకులు.. అన్ని బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారు. అధినేత చెప్పినా.. చెప్పకపోయినా.. ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో అయితే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా.. కొందరు నాయకులు.. వ్యూహాలు వేస్తున్నారు. దీనిని అమలు చేసి.. జగన్కు ప్రయాస తప్పిస్తున్నారు. మరి ఇలా.. టీడీపీలో ఎవరూ లేకపోవడం.. అన్నీ తానై చూసుకోవడం.. చంద్రబాబుకు తలకు మించిన భారంగా మారిపోయిందని అంటున్నారు.
అయితే.. దీనికి కారణం.. చంద్రబాబే అనే నాయకులు కూడా కనిపిస్తున్నారు. “ఆయన ఎవరినీ నమ్మరండీ. మేమేదో నాశనం చేస్తాం.. తినేస్తాం.. అని అనుకుంటారు. అందుకే మేం దూరంగా ఉంటాం“ అని ఉత్తరాంధ్రకు చెందిన ఒక సీనియర్ నాయకుడు చెప్పుకొచ్చారు. ఇదే అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఒకరిద్దరు.. అయితే.. మేం చేయడానికి రెడీనే. కానీ.. ఆయనకు నచ్చదు. అని మొహం మీదే చెప్పేస్తున్నారు. ఏతా వాతా ఎలా చూసుకున్నా.. వ్యూహాలు వేసేవారు. ముందుండి నడిపించేవారు.. టీడీపీలో ఎవరూ కనిపించకపోవడం.. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న పార్టీకి ఇబ్బందిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.