మీరు ఏమయినా చేసుకోండి నన్ను మాత్రం ఏమీ చేయలేరు అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని పదే పదే చెబుతూ వస్తున్నా తెలుగు దేశం పార్టీ మాత్రం ఈ విషయాన్ని వదిలేలా లేదు.దీనిపై న్యాయ పోరాటానికి సైతం తాము సిద్ధమనేని గతం లోనే చంద్రబాబు ప్రకటించేశారు.ఆ విధంగా టీడీపీ నాయకులు హస్తిన పురిలో ఇవాళ మరో కొత్త పోరాటానికి తెరలేపారు. జాతీయ మీడియాలో కూడా దీనిపై మళ్లీ మళ్లీ వార్తలు వచ్చేలా సన్నద్ధం అవుతున్నారు కూడా !
జగడం : యుద్ధమూ కాదు వైరమూ కాదు
వాస్తవానికి ఇప్పుడున్న పరిణామాల దృష్ట్యా..కొడాలి నాని ధీమా ప్రకారం..ఢిల్లీలో రాము లాంటి యువ నాయకులు ఎన్ని ఫిర్యాదులు చేసినా మోడీ అండ్ కో పట్టించుకోదు.అందుకే నాని క్యాసినో వివాదాన్ని మరీ! అంతగా తీవ్రంగా పరిగణించడం లేదు.
అక్కడ ఏం జరిగినా తనకు సంబంధం లేదన్న విధంగానే మాట్లాడుతూ, ఇంకా ఏమయినా టీడీపీ ప్రశ్నిస్తే, చంద్రబాబును, చినబాబును ఉద్దేశిస్తూ బండ బూతులు పదేపదే తిడుతూ..మీడియాలో ఓ రేంజ్ లో హైలెట్ అయ్యారు. అవుతున్నారు కూడా!
ఏ విధంగా చూసుకున్నా వైసీపీ చేసిన తప్పిదాల ఖాతాలో క్యాసినో కథ మాత్రం లేదు. ఇదే సందర్భంలో ఇంత రగడ జరగుతున్నా జగన్ పట్టించుకోలేదు సరికదా! చౌదరి సామాజికవర్గంలో రేగిన అంతర్యుద్ధంగానే దీనిని భావించారు తప్ప దీన్నొక రాజకీయ యుద్ధం మాదిరి చూడకపోవడం ఆశ్చర్యకరం.
దేవుడిపైనే భారం వేశాం : పట్టించుకుంటారా లేదా ?
ఈ నేపథ్యాన దేశ రాజకీయాల్లో కూడా సెగలు రేపుతోంది మంత్రి కొడాలి నాని క్యాసినో ఇష్యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా గుడివాడలో క్యాసినో నిర్వహించారని, ఇందుకు మంత్రికి చెందిన కన్వెన్షన్ సెంటర్ వేదిక అయిందని శ్రీకాకుళం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు తరఫున ఆరోపణలు ఉన్నాయి.
ఇదే సమయాన బెట్టింగుల రూపంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని కూడా టీడీపీ అభియోగాలు చేస్తోంది. ఇప్పుడిదే విషయమై రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ, విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. గుడివాడ క్యాసినో ఇష్యూ పై సమగ్ర దర్యాప్తు జరపాలని పట్టుబడుతున్నారు. కానీ దీనిని కేంద్ర దర్యాప్తు సంస్థ పట్టించుకుంటుందా లేదా దీన్నొక రాజకీయ ఎత్తుగడగానే వదిలేస్తుందా అన్నది ఇప్పుడిక ఆసక్తిదాయకం.