పాలక పక్ష వైఫల్యాలను వివరించే క్రమంలో టీడీపీకి ఉన్న శక్తి సరిపోవడం లేదు అన్నది ఓ పరిశీలన. ఎందుకంటే కొందరే నాయకులు అధినాయకుడి మాట వింటూ వెళ్తున్నారు. జన క్షేత్రంలో జనం మధ్య ఉంటూ వారి బాధలు వింటున్నారు. అవసరం అనుకుంటే అరెస్టులకూ సిద్ధం అయి ఉంటున్నారు. అందుకే అందరినీ ఏకతాటిపై తెచ్చే ప్రయత్నం ఒకటి జిల్లాల పర్యటనలతోనే సాధ్యం అని భావించి జగన్ కన్నా ముందే జనం మధ్యకు బాబు రానున్నారు.
రాజకీయ వాతావరణం వేడి మరింత పెంచనున్నారు.ఎన్నికలకు రెండేళ్ల దూరం ఉన్నా సరే పార్టీల పంథా మాత్రం వేరుగానే ఉంది. స్వపక్ష , విపక్ష పార్టీల యుద్ధంలో తేలేది ఎవ్వరు అన్నది విజేత ఎవ్వరు అన్నది తరువాత కనీస స్థాయిలో ప్రజా మద్దతు పొందాలంటే మున్ముందు సాధించాల్సినవి, ముందుకు సాగించాల్సిన ప్రయాణాలు అన్నవి చాలానే ఉన్నాయి. అందుకే జగన్ కన్నా చంద్రబాబు తనదైన శైలిలో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు.
మండుటెండల్లో ఏడు పదుల వయసును సైతం లెక్క చేయక నిరసన కార్యక్రమాలకు శ్రీకారం దిద్దుతున్నారు. మరోవైపు లోకేశ్, అచ్చెన్న లాంటి వారు ప్రజా క్షేత్రంలో నిరంతరం ఉంటూ పార్టీ తరఫున గొంతుక వినిపిస్తున్నా చంద్రబాబు వస్తే కొన్ని రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందన్న ఉద్దేశం ఒకటి సంబంధిత నాయక వర్గంలో ఉంది. అందుకే బాబు మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి, ప్రభుత్వ వైఫల్యాలు వివరించేందుకు గ్రామ సభల నిర్వహణకు సమాయత్తం అవుతున్నారు.
అనూహ్య వ్యూహాల అమలులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముందుంటారు. విపక్షాలకు అందనంత ఎత్తులో కొన్ని సార్లు ఉంటారు. ఆయన కొన్ని మాటలు ఆచరణాత్మకం అయితేనే చెబుతారు.ఆ విధంగా ఆయన స్వర్ణాంధ్ర సాధకుడిగా పేరు తెచ్చుకున్నారు. తిరుగులేని నేతగా పేరు తెచ్చుకున్నారు.
ఎన్ని చెప్పుకున్నా కూడా ఆయన స్థాయిని చేరుకునే నాయకుడు ఇంకా టీడీపీలో లేరు కూడా! అందుకే ఇప్పటికీ వ్యూహాల అమలులో ముందంజలో ఉంటారు. పార్టీని బతికించే పనులు తానొక్కడినే చేయలేను అని, అంతా కలిసి సమష్టి కృషితో పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని తరుచూ చెబుతుంటారు.
ఆ కోవలో ఆ తోవలో పార్టీని బతికించే పనులు వీలున్నంత వరకూ తన నిర్దేశకత్వంతోనే చేయిస్తుంటారు. ముఖ్యంగా త్వరలో ఆయన జిల్లాలకు రానున్న వార్త బాగా ప్రచారంలోకి వచ్చింది. మే నాలుగు నుంచి ఆయన పర్యటనలు ఖరారు అయ్యాయి. ముందుగా శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, దల్లావలస గ్రామం నుంచి ఆయన పర్యటన ప్రారంభం కానుంది.
అక్కడి నుంచి వివిధ ప్రాంతాలలో పర్యటించేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం అయింది. అటుపై 5న తేదీ ఉమ్మడి విశాఖ జిల్లా, భీమిలి నియోజవర్గం, తాళ్లవలసలో, 6న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడి వరం నియోజవర్గం కోరింగ గ్రామంలో పర్యటించి, బాదుడే బాదుడు పేరిట నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. వాస్తవానికి మే పది నుంచి గడగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ఉండడంతో అధికార పార్టీ కన్నా ముందే బాబు వస్తున్నారు.