ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అందరూ ఎక్కువగా చర్చించుకునే నియోజకవర్గం పలాస . ప్రస్తుత ఎన్నికల్లో టీడీపీ మహిళా నాయకురాలు, పొలిటికల్ సివంగిగా పేరు తెచ్చుకున్న గౌతు శిరీష విజయం దక్కించుకుంటారనే అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. “మా మేడం గెలుపు ఖాయం. మా బెల్ట్ బెల్టంతా కూడా.. ఆమెకు జై కొడుతున్నారు“ అని కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. స్థానికంగా పట్టు ఉండడంతో పాటు అనేక సమస్యలపై ఆమె అలుపెరుగని పోరాటమే చేశారు.
వాస్తవానికి పలాసలో గత ఎన్నికల్లో వైసీపీ విజయం దక్కించుకుంది. డాక్టర్ సీదిరి అప్పలరాజు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. ఇదే సమయంలో బీసీ నాయకురాలు, సర్దార్ గౌతు లచ్చన్న మనవరాలిగా గౌతు శిరీష ఇక్కడ టీడీపీ టికెట్‌పై మరోసారి పోటీకి దిగారు. గత ఎన్నికల్లోనే ఆమె విజయం ఖాయమని అనుకున్నా.. ఇక్కడి ప్రజలు వైసీపీ హవాకు ఫిదా అయ్యారు. ఈ క్రమంలోనే సీదిరి అప్పలరాజుకు పట్టం కట్టారు. అయితే.. ఆయన ఐదేళ్లు మంత్రిగా ఉన్నా.. చేసింది ఏమీలేదని స్థానికంగా వినిపిస్తున్న మాట.
ఇక, టీడీపీ నాయకురాలిగా శిరీష.. పురుష అభ్యర్థి కన్నా ఎక్కువగా ఇక్కడ పోరాటాలు చేశారు. రాష్ట్ర సమస్య అయినా.. నేనున్నానంటూ.. ఆమె ముందుకు వచ్చారు. సహజంగా వారసత్వాన్ని చెప్పుకొనే నాయకులు చాలా మంది ఉన్నారు. కానీ, శిరీష.. అటు ఘనమైన వారసత్వం(తాత, తండ్రి మొత్తం పదిసార్లు ఎమ్మెల్యేలుగా చేశారు) ఉన్నా.. చెట్టు పేరు చెప్పుకోకుండా.. తనకంటూ సొంత ఇమేజ్ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగారు. మహిళా నేతగా కేవలం మహిళల సమస్యపైనే కాకుండా.. అన్ని సమస్యలను ఆకళింపు చేసుకున్నారు.
మత్స్యకార సమస్యల నుంచి విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగ సమస్యల వరకు శిరీష అలుపెరుగని పోరాటం చేశారు. అనేక కేసులు ఎదురైనా ధైర్యం విడిచి పెట్టుకుండా ముందుకు సాగారు. అంతేకాదు.. తన పంథాలో పార్టీని ముందుకు నడిపించారు. దీంతో గత ఎన్నికల్లో కోల్పోయిన ఓటమి ఇప్పుడు నామినేషన్లకు ముందే.. ఆమె ను వరించేందుకు రెడీ కావడం గమనార్హం. ఇక, మంత్రిగా ఉన్న సీదిరి ఏం చేశారని అడిగితే చెప్పలేని పరిస్థితి.
అందరూ చెప్పినట్టే రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న పథకాలే ఇక్కడ కూడా అమలవుతున్నాయని చెబుతున్నారు. దీంతో ఆయన చేసింది ఏమీ లేదని ప్రజలకు బాగానే అర్థమైంది. దీంతో శిరీష గెలుపు ఖాయమని.. కేవలం మెజారిటీపైనే లెక్కలు వేసుకుంటున్నామని టీడీపీ నాయకులు చెప్పుకొనే పరిస్థితి వచ్చింది.
శిరీష ప్లస్‌లు ఇవీ..
+ ఐదేళ్లు కిందట ఓడిపోయినా.. మొక్కవోని పట్టుదలతో నియోజకవర్గం కోసం అంటిపెట్టుకుని ఉండడం.
+ టీడీపీ కేడర్‌ను బలోపేతం చేసుకోవడం.
+ సీదిరి ఓ మహిళ అని చూడకుండా ఆమెను రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసినా సివంగిలా పోరాడడం.
+ నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేయడం.
+ ఘనమైన వారసత్వం ఉన్నా.. తనకంటూ ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ కావడం.