సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. జగన్ ఓటుకు పది వేలిచ్చినా…ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు అన్ స్టాపబుల్… టీడీపీ అన్ స్టాపబుల్… తమకు అధికారం అన్ స్టాపబుల్! అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. జగన్ అజ్ఞానానికి, అమాయకత్వానికి ఏం చెబుతాం? అంటూ మండిపడ్డారు. తప్పుడు కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, వారిని వేధించే పోలీసుల్ని ఉపేక్షించేది లేదని చంద్రబాబు అన్నారు. వైసీపీ వేధింపులు తాళలేక ఎమ్మెల్యే రాం రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇంటి ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ టీడీపీ నేత హర్ష కుటుంబానికి అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. హర్ష ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, హర్ష ఇద్దరు పిల్లల చదువు బాధ్యత తాను తీసుకుంటానని తెలిపారు.
ఇతర పార్టీల నుంచి మంచి ట్రాక్ రికార్డు ఉన్న నేతలను తీసుకోవడంలో తప్పులేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంపై నిబద్ధత ఉండే మంచి నేతలను తీసుకుంటామని, అదే సమయంలో పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్లను మరిచిపోమని, వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
గోపీచంద్ అకాడమీకి స్థలం ఎవరిచ్చారో జగన్ గుర్తు చేసుకోవాలని కోరారు. కోవూరులో 100 ఎకరాల్లో మూడు వేల కోట్లతో మిధాని ప్రాజెక్టు తీసుకొచ్చానని, ఆ ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇక్కడ యువతకు ఉద్యోగావకాశాలు వచ్చి ఉండేవని చెప్పారు.
రామాయపట్నం పోర్టు ఎందుకు రద్దయిందని? భూములు ఎందుకు చేతులు మారాయని ప్రశ్నించారు. 2,400 మెగావాట్లున్న ఏపీ జెన్ కో ప్రాజెక్టును కూడా ప్రైవేటుపరం చేస్తున్నారని మండిపడ్డారు.