2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. వైసీపీ పాలనపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఈ కూటమి విజయం ఖాయమని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ కూటమికి దాదాపు 146 స్థానాలు వస్తాయని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడి కావడం ఆసక్తికరంగా మారింది. ఇక, 25 లోక్ సభ స్థానాలకుగాను కూటమి 20 దక్కించుకోనుందని సర్వేలో వెల్లడైంది. అధికార పార్టీ వైసీపీ 29 అసెంబ్లీ స్థానాలు, 5 లోక్ సభ స్థానాలతో సరిపెట్టుకోనుందని తెలుస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 44.7 శాతం ఓట్లు పోల్ అవుతాయని, వైసీపీకి 41.9 శాతం ఓట్లు పోల్ అవుతాయని సర్వేలో వెల్లడైంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. మరోవైపు, నెట్వర్క్18 (న్యూస్18) మెగా ఒపీనియన్ పోల్ లో కూడా టీడీపీ కూటమి విజయ భేరి మోగించనుందని పేర్కొంది. టీడీపీ కూటమికి 50 శాతం ఓట్లు లభిస్తాయని, వైసీపీకి 41 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 6 శాతం ఓట్లు, ఇతరులకు 3 శాతం రావచ్చని అంచనా వేసింది. టీడీపీ కూటమికి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి 7 సీట్లు దక్కనున్నాయని వెల్లడించింది.
జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వల్ల టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఈ రెండు సర్వేలు చెబుతున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 22 ఎంపీ సీట్లు, టీడీపీకి 3 ఎంపీ సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీకి 49.1 శాతం, టీడీపీకి 39.2 శాతం ఓట్లు వచ్చాయి.