ఏపీలో రాజకీయం ఎంతలా మారిందన్న దానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఎన్నికల ఫలితాలు వెలువడి.. టీడీపీ కూటమి చేతికి అధికారం వచ్చిన తర్వాత పవర్ కోల్పోయిన వైసీపీ వారిపై దాడులు జరుగుతున్నట్లుగా ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. అయితే.. టీడీపీ కార్యకర్తలు.. మద్దతుదారులపై కూడా అంతకు మించి అన్నట్లుగా దాడులు జరుగుతున్న వైనాన్ని టీడీపీ బయటకు చెప్పుకోలేకపోతోంది. ఇందుకు తాజా ఉదంతం ఒక పెద్ద ఉదాహరణ. విజయవాడలోని నోవోటెల్ లాంటి పెద్ద హోటల్లో టిఫిన్ చేస్తూ చంద్రబాబు.. లోకేశ్ ను పొగుడుతూ మాట్లాడుకుంటున్న వారిపై వైసీపీ నేత ఒకరు వైల్డ్ గా రియాక్టు కావటం.. వారిపై దాడికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది.
ఏదో చిన్నచితక హోటల్ వద్ద ఇలాంటివి చోటు చేసుకొని ఉంటే.. దాన్ని మరోలా చూడొచ్చు. నోవోటెల్ లాంటి హోటల్ లో టిఫిన్ చేస్తూ మాట్లాడుకుంటున్న వారిపై వైసీపీ నేత దాడి చేయటం.. తన ముందే చంద్రబాబు, లోకేశ్ ను పొడిగే ధైర్యం చేస్తారా? అంటూ విరుచుకుపడ్డాడు సదరు వైసీపీ నేత. అక్కడితో ఆగకుండా కారులో వెంబడించి మరీ వార్నింగ్ ఇవ్వటం షాకింగ్ గా మారింది. ఇంత పెద్ద సంఘటన జరిగింది జూన్ ఐదు కాగా.. ఈ విషయం దాదాపు నలభై రోజుల తర్వాత వెలుగు చూడటం గమనార్హం.
అసలేం జరిగిందంటే..
జూన్ ఐదున విజయవాడ నోవోటెల్ హోటల్లో టిఫిన్ చేస్తూ చంద్రబాబు.. లోకేశ్ సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటున్నారు కంచికచర్ల మండలం మోగులూరుకు చెందిన గద్దె శివక్రిష్ణ.. కొత్తపేటకు చెందిన అబ్బూరి శివనాగ మల్లేశ్వరరావు. వారికి ఎదురు టేబుల్ దగ్గర ఉన్న వ్యక్తి వీరి వైపు దూసుకొచ్చి.. ‘‘నా ముందే చంద్రబాబు, లోకేశ్ లను పొగుడుతార్రా..? వాళ్లు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారో చూస్తా’’ అంటూ దాడికి ప్రయత్నించాడు. అక్కడే ఉన్న హోటల్ సిబ్బంది అడ్డుకొన్నారు.
కట్ చేస్తే.. ఈ ఘటన జరిగిన దాదాపు 35 రోజుల తర్వాత ఈ నెల (జులై) పదిన విజయవాడ నుంచి కంచికచర్లకు శివక్రిష్ణ.. శివనాగమల్లేశ్వరరావులు కారులో వెళుతున్నారు. వారిని మరో కారు వెంబడించింది. పరిటాల వైపు వెళ్లేందుకు అండర్ పాస్ రాగానే వారిని అడ్డుకున్న ఐదుగురు.. తమ నాయకుడు నాగార్జున యాదవ్ కే ఎదురు మాట్లాడతార్రా? చంద్రబాబు.. లోకేశ్ లు గెలిచారని నోవోటెల్ హోటల్లో సంబరాలు చేసుకుంటారా? హోటలోళ్లు అడ్డు రాకపోతే ఆ రోజే మీరు చచ్చిపోయేవారు. ఇక్కడ మిమ్మల్ని కొట్టినా.. చంపినా దిక్కెవరు?’’ అంటూ బండ బూతులు తిడుతూ దాడికి పాల్పడబోయారు.
ఆ సమయంలోనే అటుగా బస్సులు.. ఇతర వాహనాలు వస్తుండటంతో నాగార్జున యాదవ్ మనుషులు విజయవాడ వైపు వెళ్లిపోయారు. తమపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబు.. లోకేశ్ గెలుపుపై మాట్లాడుకున్నా దాడికి పాల్పడే ప్రయత్నం చేస్తున్న వైసీపీ బ్యాచ్ తీరు విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరహా ఘటనల్నిపోలీసులు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. అదే సమయంలో ఇలాంటి ఉదంతాలపై తెలుగుదేశం పార్టీ వేగంగా రియాక్టు కావటం.. వైసీపీ ఆగడాలను అందరికి తెలిసేలా చెప్పాల్సిన అవసరం ఉంది.