ఇండియన్ స్టాక్ మార్కెట్ కాసుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా కరోనా మొదటి వేవ్ వచ్చినపుడు దారుణంగా పడిపోయిన మార్కెట్ ఏడాదిలో రెట్టింపు అయ్యింది. దీంతో 80 శాతం షేర్లు ఏడాదిలో డబుల్ అయ్యాయి. 20 శాతం షేర్లు రెండు మూడు రెట్లు కూడా పెరిగాయి.
మార్కెట్లో అత్యుత్తమ షేర్లలో ఒకటైన టీసీఎస్ 2004 లో మార్కెట్లో ప్రవేశించింది. ఏదైనా కంపెనీ షేర్ మార్కెట్లోకి రావాలంటే ముందుగా ఐపీవో విడుదల చేస్తుంది. అపుడు ఒక రేటు ఫిక్స్ చేస్తుంది. అపుడు ఇన్వెస్ట్ చేసిన వారికి అప్పటి డిమాండ్ కు అనుగుణంగా షేర్లను కేటాయిస్తుంది. ఇలా ఓ వ్యక్తి టీసీఎస్ లో 850 రూపాయలు పెట్టాడట. అతను ఇప్పటికీ దానిని అమ్మలేదు. ఆ డబ్బు ఇపుడు 28వేలు అయ్యిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు.
గురువారం సంస్థ 26వ వార్షిక సాధారణ సమావేశంలో చంద్రశేఖరన్ ఈ వ్యాఖ్యలు చేశారు. టీసీఎస్ ఐపీవోలో పెట్టుబడి పెట్టిన వారికి వారి సంపద 3000 శాతం పెరిగిందన్నారు. కరోనాలో కూడా టీసీఎస్ ఉత్తమ పనితీరు కనబరిచిందన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కంపెనీ ముందుకు పోతుందన్నారు. నిర్వహణ లాభాల్లో కంపెనీ 25.9 శాతం వృద్ధిని నమోదు చేయడంతో ప్రతి షేర్‌పై రూ.38 డివిడెండ్ ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.