టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ పై మాజీ మంత్రి, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పలు సందర్భాల్లో దూషణలకు దిగిన సంగతి తెలిసిందే. బూతుల మంత్రి అంటూ టీడీపీ నేతలు పిలుచుకునే నాని..పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ గెలుపును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
ఈ క్రమంలోనే టార్గెట్ గుడివాడ అంటూ టీడీపీ నేతలకు చంద్రబాబు తాజాగా దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నేతల మధ్య సమన్వయం కుదర్చే కార్యక్రమంపై చంద్రబాబు కొంతకాలంగా ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. గుడివాడలో గెలుపే టీడీపీ టార్గెట్ అని స్థానిక నేతలకు ఆయన తేల్చి చెప్పారు. త్వరలోనే గుడివాడ అభ్యర్థి పేరు వెల్లడిస్తానని, విజయం కోసం పార్టీ నేతలంతా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం ఎవరెంత కష్టపడుతున్నాడో తన దగ్గర నివేదిక ఉందని చెప్పారు. అనకాపల్లిలో నేతల తీరు మారకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు.
మాజీ శాసనసభ్యుడు పీలా గోవింద్, మాజీ ఎమ్మెల్సీ నాగజగదీశ్వరరావు వర్గాలు సఖ్యతతో ముందుకు పోవాలని ,గ్రూపు రాజకీయాలను సహించబోనని తేల్చి చెప్పారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ నేతల మధ్య అభిప్రాయభేదాలను చంద్రబాబు పరిష్కరించారు. గుంతకల్లు నియోజకవర్గ ఇన్చార్జి జితేందర్ గౌడ్ పనితీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరింత మెరుగ్గా పని చేయాలని, లేకుంటే కష్టమని అన్నారు. పార్టీ గెలుపే పరమావధిగా అందరూ ముందుకు పోవాలని హితవు పలికారు.