టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు టీడీపీ పరంగా.. 160 స్థానాలు.. 150 స్థానాల్లో గెలుపు కోసం.. తమ్ముళ్లు కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన..అనూహ్యంగా రాజకీయ పంథా మార్చుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ 175 సీట్లకు 175 సీట్లు గెలిచి తీరాలని.. ఆయన తమ్ముళ్లకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం చంద్రగిరి మండలంలోని తన సొంత గ్రామం.. నారావారిపల్లెలో పర్యటిస్తున్న ఆయన సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. “మేం మాత్రం తక్కువా. టీడీపీ ఏం పాపం చేసుకుంది. ప్రజలకు ఎన్నో చేశాం. మేం కూడా 175 సీట్లలో గెలిచేందుకు ప్రయత్నిస్తాం. 175 సీట్లలో గెలిచేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలి. చిత్తూరు జిల్లా పుంగనూరు(మంత్రి పెద్దరెడ్డి నియోజకవర్గం)లో అధికార పార్టీ అరాచకాలు పేట్రేగిపోయాయి“ అని చంద్రబాబు విమర్శించారు
ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠినత్వాన్ని చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
నెల్లూరు జిల్లా కందుకూరులోను, గుంటూరు జిల్లాలోనూ జరిగిన తొక్కిసలాటలు.. దారుణమని వ్యాఖ్యానిం చిన చంద్రబాబు.. అయితే.. వీటి వెనుక ఏదో కుట్ర ఉందని చెప్పారు. ఈ కుట్ర కోణం కూడా త్వరలోనే బయటకు వస్తుందని.. అప్పుడు చంద్రబాబు అంటే ఏంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.