ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాజమండ్రి చేరుకున్న ఈ పాదయాత్రకు హీరో నందమూరి తారక రత్న మద్దతు తెలిపారు. చాలాకాలం తర్వాత బయట కనిపించిన తారక్…ఏపీ రాజకీయాలలోని తాజా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ బాబాయి, చంద్రబాబు మామయ్య ఇద్దరూ కలిస్తే మంచిదేనని, వారు ప్రజల కోసం పోరాడుతున్నారని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని పక్కనబెట్టిందని, యూనివర్సిటీకి తాతగారి పేరు మార్చడం వంటి కార్యక్రమాలపై ఫోకస్ చేసిందని విమర్శించారు. ప్రజలలోకి వైసీపీ నేతలు వచ్చి చూడాలని, వారి బాధలు తెలుసుకోవాలని అన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో రాష్ట్ర భవిష్యత్ ఏమైపోతుందోనని ఆందోళనగా ఉందన్నారు. ప్రభుత్వంపై జనాల్లో తిరుగుబాటు వచ్చిందని, రాబోయే ఎన్నికల్లో ఫలితం వారిచేతిలోనే ఉందని అన్నారు. తాను 2009 నుంచి రాజకీయాల్లో యాక్టివ్ గానే, రాబోయే ఎన్నికల్లో కూడా యాక్టివ్ రోల్ పోషిస్తానని చెప్పారు. బాలయ్య బాబాయి రోజురోజుకూ యూత్ లా తయారవుతున్నారని, అన్ స్టాపబుల్ షోలో చంద్రబాబు మామయ్య చెప్పిన విషయాలపై మాట్లాడబోనని అన్నారు.
తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, అలాంటి వారంతా పాదయాత్ర చేస్తున్న రైతులకు మద్దతివ్వాలని అన్నారు. ఇది స్వార్థంతో చేస్తున్న యాత్ర అయితే న్యాయస్థానానికి వెళతారని, కాదు కాబట్టే దేవస్థానానికి వెళ్తున్నారని అన్నారు. నందమూరి తారకరన్న పాదయాత్రలో పాల్గొనడం ఆనందంగా ఉందని రైతులు అన్నారు. ఆయన రాక తమలో నూతనోత్సాహం నింపిందని రైతులు చెబుతున్నారు.