టాలీవుడ్ స్టార్ హీరో తారక్ కు సన్నిహితుడు, టీడీపీ తరఫున 2019 ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ తర్వాత గోడ దూకి వైసీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికకు వెళ్లకుండా ఉన్న వంశీ..అసెంబ్లీలో ఇటు టీడీపీ సభ్యుడిగా కాకుండా…అటు వైసీపీ సభ్యుడిగా కాకుండా…ఓ ప్రత్యేక సభ్యుడిగా కూర్చుంటున్నారు. ఇక, గన్నవరంలో ఆల్రెడీ వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు, వల్లభనేని వంశీకి మధ్య ముందు నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది.
గన్నవరంలో తాను ముందు నుంచి వైసీపీ నేతగా ఉన్నానని వెంకట్రావు అంటుండగా…తాను జగన్ చెప్పినట్లు నడుచుకుంటున్నానని వంశీ అంటున్నారు. దీంతో, గన్నవరంలో వైసీపీ రాజకీయం గరం గరంగా మారింది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకట్రావు అంటుంటే…ఆ టికెట్ తనకు ఖాయమని వంశీ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇలా ఈ ఇద్దరి మధ్య చాలాకాలంగా కోల్డ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో వంశీ తాజాగా గన్నవరం నుంచి వైసీపీ తరఫున 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
విజయవాడ ఎంపీగా తాను పోటీ చేయబోతున్నానని వస్తున్న వార్తలను వంశీ ఖండించారు. ఈ విషయంపై జగన్ కూడా ఏమీ మాట్లాడలేదని, తాను గన్నవరం నుంచే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని వంశీ ప్రకటించారు. అమరావతిని జగన్, మరెవరు వ్యతిరేకించడం లేదని… దానిని అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధులు లేవని చెబుతున్నారని కొత్త భాష్యం చెప్పారు.
2009లో టీడీపీ తరఫున ముమ్మరంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను 2014లో ప్రమాణస్వీకార కార్యక్రమం సందర్భంగా స్టేజిపైకి ఆహ్వానించలేదని అన్నారు. అమరావతితో తారక్ కు సంబంధం లేదని, అమరావతి రైతులకు ఆయన మద్దతివ్వడం లేదని విమర్శించడం సరికాదని చెప్పారు. ఆయన సినిమాలేవో ఆయన చేసుకుంటున్నారని, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ ను కరివేపాకుగా వాడి వదిలేశారని, 2014లో తారక్ కు ఒక బ్యానర్ కూడా కట్టలేదని అన్నారు. ఆనాడు జనాల మధ్యలో తారక్ ను కూర్చోబెట్టారని…ఇప్పుడు అవసరం వచ్చిందని రమ్మంటే ఆయన ఎలా వస్తారని ప్రశ్నించారు.