తాప్సీ పన్ను..టాలీవుడ్ లో తెరంగేంట్రం చేసి బాలీవుడ్ లో పాగా వేసిన హీరోయిన్. తన నటనతో ఈ మధ్యకాలంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ…తన వ్యవహార శైలి, మాటతీరుతో మాత్రం నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. దక్షిణాది సినిమాలు…ముఖ్యంగా తెలుగు సినిమాలంతా చెత్త అని కామెంట్లు చేసిన తాప్సీపై విపరీతమైన ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక, ఇటీవల బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు తన జీవితంలో కంగనాకు ఎలాంటి ప్రాధాన్యం లేదని తాప్సీ వ్యాఖ్యానించడం దుమారం రేపింది.
తాప్సీ బీ గ్రేడ్ ఆర్టిస్ట్ అని, తాను వదిలేసిన చాలా ప్రాజెక్ట్‌ల్లో తాప్సీకి అవకాశం వచ్చిందని కంగనా కూడా కౌంటర్ ఇచ్చింది. ఆ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో తాజాగా బాలీవుడ్ లో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జొహర్ పై తాప్సీ షాకింగ్ కామెంట్లు చేసింది. ‘కాఫీ విత్ కరణ్’ షోకు ఆహ్వానించేంత ఆసక్తికరంగా తన లైంగిక జీవితం లేదని తాప్సీ షాకింగ్ కామెంట్లు చేసింది.
‘కాఫీ విత్ కరణ్’ షో సీజన్ 7 సక్సెస్ ఫుల్ గా నడుస్తోన్న సంగతి తెలిసిందే. తమ సినిమాల ప్రమోషన్ల కోసం జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే, అక్షయ్ కుమార్, సమంత వంటి ఎంతో మంది ప్రముఖ నటీనటులు ఈ షోకు హాజరై సందడి చేశారు. అంతేకాదు, ఈ షోలో కరణ్ అడిగే ప్రశ్నలకు సమాధానంగా తమ వ్యక్తిగత విషయాలెన్నింటినో బయటపెట్టి సంచలనం రేపారు.
ఈ క్రమంలోనే తాప్సీ నటించిన ‘దొబారా’ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో తాప్సీ కనిపించకపోవడంపై మీడియా ఆమెను ప్రశ్నించింది. అయితే, ఈ షోలో పాల్గొనేందుకు తన సెక్స్ లైఫ్ ఏమంత ఆసక్తికరంగా లేదంటూ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో, తాస్పీ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరి, తాప్సీ కామెంట్లపై కరణ్ జొహర్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.