అమెరికాకి తెలుగు వారు వలస వెళ్లడం స్వతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి జరుగుతోంది. వైద్యులు, సైంటిస్టులు వంటి వృత్తినిపుణులు వలసలతో మొదలై నేడు అన్ని రకాల వారు అమెరికాకు వలస వెళ్తున్నారు. ఇక వారి వారి పిల్లలతో మన తెలుగు జనాభా బాగా పెరగసాగింది. తెలుగు వారిలో ఐకమత్యాన్ని పెంపొందించడానికి పుట్టిందే “తానా” సంస్థ. దూరదృష్టితో అమెరికాలో స్థిరపడిన, స్థిరపడాలనుకుంటున్న తెలుగు వారి సంక్షేమం దృష్ట్యా ఏర్పడిన ఈ సంస్థను తొలి నాళ్లలో చాలా మంది పెద్దలు ఎంతో అంకిత భావంతో నడిపారు. వారి కృషి వల్ల “తానా” ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదిగింది. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి సేవ చేస్తూనే ఆంధ్ర, తెలంగాణలలోనూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది.
అయితే కాలక్రమేణా, జనం పెరిగే కొద్దీ మరింత పెరగాల్సిన ఐకమత్యం… ఇటీవలి కాలంలో కనుమరుగైంది. ఐకమత్యం స్థానంలో రాజకీయం, పదవుల స్వార్థం పెరగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పడిన “తానా”లో మునుపటి వైభవం కనిపించడం లేదు. సంస్థ కోల్పోతున్న వైభవం తిరిగి తేవాలనే చర్చ జరుగుతున్నట్టు సమచారం. అమెరికా జాతీయ తెలుగు సంఘాల్లో మొట్టమొదటిదైన “తానా”కు దశాబ్దాల ఘన చరిత్ర ఉంది.
ఇక, ప్రతి రెండేళ్లకోసారి అట్టహాసంగా నిర్వహించే “తానా” మహాసభలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఈ సందర్భంలోనే ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఎన్నికల తేదీ వెలువడింది మొదలు ఫలితాలు వెలువడే వరకు అమెరికాతో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగువారు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సారి జరగబోయే ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది.
ఈ ఉత్కంఠకు కారణం రాబోయే ఎన్నికల “అధ్యక్ష” పదవి రేసులో ముగ్గురు ఎన్నారైలు పోటీపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వారిలో ప్రస్తుత “తానా” ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు, “తానా” బోర్డు మాజీ చైర్మన్ “నరేన్ కొడాలి” మరియు “తానా “మాజీ ఫౌండేషన్ చైర్మన్, ప్రస్తుత అధ్యక్షుడు జే తాళ్లూరి పై పోటీ చేసిన “శ్రీనివాస్ గోగినేని”లు పోటీపడుతున్నట్లు సమాచారం. గట్టి పోటీ ఉండటంతో ఈసారి ఎవరు మంచి అభ్యర్థి అనే చర్చలు ఎన్నారైల్లో మొదలయ్యాయి. సంస్థ ను పటిష్టపరిచే ఉద్దేశంతో రంగంలోకి దిగుతున్న పెద్దలు, ఈసారి అనుభవం ఉన్న, స్వార్థరహిత నాయకుడిని ఎన్నుకుని సంస్థను మరింత బలోపేతం చేయాలని అనుకుంటున్నారట.
సంస్థ కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తోన్న నిజాయితీపరుడైన సీనియర్ ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని చాలామంది ఎన్నారైలు కూడా అభిప్రాయపడుతున్నారు. గత కొంతకాలంగా సంస్థ పై తెలుగు సమాజం దృక్పథం మారుతున్న ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో మహిళలు, కొత్త తరం పిల్లలు, యువతను కూడా “తానా”లో భాగస్వాములను చేసి సంస్థకు పూర్వ వైభవం తెచ్చే వ్యక్తి అధ్యక్షుడైతే బాగుంటుందని అనుకుంటున్నారు.
“తానా” వ్యవస్థాపకులు, సీనియర్లు, శ్రేయోభిలాషులు, మాజీ అధ్యక్షులు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిజంగానే పెద్దలు మేల్కొని దిద్దుబాటు చర్యలుతీసుకొంటారని, తిరిగి మంచి ప్రాభవం త్వరలో వస్తుందని ఆశిద్దాం.