‘తానా’ ఎన్నికల విషయానికి వస్తే ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి ‘త్రిముఖ’ పోటీ ఉంటుందని ‘నమస్తే ఆంధ్ర’ రెండు నెలల ముందే చెప్పిన విషయం అక్షరాలా నిజమై,’తానా’ విషయంలో తమదైన విషయ సేకరణపై విశ్వసనీయత రుజువు చేసుకొంది.అందరికంటే ముందుగా,ఎవరూ ఊహించని విధంగా, అమెరికా వ్యాప్తంగా గుర్తింపు ఉన్నసీనియర్ నాయకుడు ‘శ్రీనివాస గోగినేని’ న్యూ ఇయర్ మొదటి తేదీన ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవి బరిలోకి బహిరంగంగా దిగగా,ఒక వారం తరువాత ‘నిరంజన్ శృంగవరపు’ కూడా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించిన తరువాత,ఈ మధ్యనే ‘నరేన్ కొడాలి’ కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించారు. 45 సంవత్సరాల ‘తానా ‘ఘన చరిత్ర లో ఎన్నడూ జరగని, ఊహించని విధంగా జరుగబోతున్న ‘త్రిముఖ’ ఎన్నికలలో చారిత్రక ఫలితాలతో, కొత్త చరిత్ర పుడుతుందని అనేకమంది భావిస్తున్నారు.
అయితే జరుగబోతున్న ప్రమాదాన్నిమెల్ల మెల్లగా అర్ధం చేసుకుంటున్న స్వయం ప్రకటిత అధిష్ఠానం ఫలితాలు తిరగబడితే ,అంతర్జాతీయంగా వచ్చే సమస్యలను జీర్ణించుకోలేక ‘తానా’ బోర్డు లోని తమ అనుయాయులద్వారా ప్రెసిడెంట్ పదవికి మాత్రం ఎన్నికలు ఆపే విధంగా కుయుక్తులు పన్నుతున్నట్లు సమాచారం.కానీ ఈ ప్రయత్నాలకు ఆది లోనే గండి కొట్టే విధంగా ‘తానా’ బోర్డులో పరిణామాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.దీంతో పాటు ఎన్నికల షెడ్యూల్ మరియు ఎన్నికల విధానాలు కూడా ఉండే అజండాతో వచ్చే వారంలో జరుగబోయే ‘తానా ‘బోర్డ్ చర్చ అత్యంత కీలకం కాబోతోంది.కాగా వివిధ వర్గాల్లో సమీకరించిన సమాచారంతో ప్రస్తుత వాతావారణం ఈ క్రింది విధముగా ఉంది.
శ్రీనివాస గోగినేని వర్గం :‘త్రిముఖ’ పోటీ బహిరంగంగా ఖరారు కావటంతో పాటు, మిగతా రెండు వర్గాల మధ్య క్రమక్రమంగా రాజుకుంటున్నకసితో కూడిన వైరంతో వచ్చిన నిట్ట నిలువు చీలిక కావలసిన గెలుపు నెంబర్ ను సగానికి తగ్గించడంతో విజయ తీరాలకు చేరినట్లేనని ‘గోగినేని’ వర్గం భావిస్తోంది.తమకు స్వచ్చందంగా వచ్చే మూడవ వంతు ఓట్లు, ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోయే అవకాశాలు లేకపోగా,రెండు వర్గాలపై ఉన్న ఏమాత్రం వ్యతిరేకత అయినా తమకే లాభం చెసే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయని భావిస్తోంది.అంతే గాక వారం క్రితం ‘మహా టీవీ’ ప్రైమ్ టైంలో వచ్చిన 30 నిమిషాల ఇంటర్వ్యూ లో ‘శ్రీనివాస గోగినేని’ ‘తానా ‘సంస్థ ఉన్నతి, ప్రస్తుత పరిస్థితులు,తన భావాలు గురించి ఎంతో స్ఫూర్తిగాను ఆసక్తికరంగాను వివరించడాన్ని,లైవ్ లో కాకూండానే,యుట్యూబ్ ద్వారా 10 వేల పైగా తిలకించడం తమ గురించి మొదలైన పాజిటివ్ వేవ్ అనుకుంటున్నారు.మధ్యస్థం గా ఉండే అనేకమంది సాధారణ సభ్యులనుంచి స్వచ్చందంగా వస్తున్న మద్దతు, మిగతా రెండువర్గాల వారికి కూడా రెండవ ఛాయస్ తామే కావడం రాబోయే రోజుల్లో మరింత బలం పుంజుకోవడానికి సూచన అని చెప్తున్నారు.వెరసి క్షేత్ర స్థాయిలో హడావిడి చేసే జనాలు లేరేమో అన్నలోటు కూడా తీరిపోయి,ఇప్పటివరకూ సేకరించిన బలాన్ని నిలుపుకొంటూ, క్రమంగా మద్దతు పెంచు కొనే దారిలో సాగిపోతున్నారు.
గోగినేని వర్గం సంక్రాతి పండుగ సందర్భగా పాడుకొంటున్న పాటలు..
పైకి:ఉందిలే మంచి కాలం ముందు ముందునా,అందరూ సుఖ పడాలి నంద నందనా! ఎందుకో సందేహమెందుకో, రానున్న విందులో నీ వంతు అందుకో! ఉందిలే మంచి కాలం ముందు ముందునా!
లో లోపల: మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది -ఎదిగిన కొద్దీ ఒదగమని అర్ధమందులో ఉంది!
అపజయాలు కలిగినచోటే, గెలుపు పిలుపు వినిపిస్తుంది -దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా,దరికి చేర్చే దారులెన్నో ఉన్నాయి!
నిరంజన్ శృంగవరపు వర్గం: పోటీని బహిరంగంగా ప్రకటించిన తరువాత కూడా నరేన్ వర్గం నుండి చీల్చుకొన్నవారిని ఇప్పటివరకు కాపాడుకుంటున్నందున, భవిష్యత్తు ఆశాజనకంగానే ఉన్నట్టు భావిస్తున్నారు. ఇదే పరిస్థితుల్లో మరి కొంతమందిని కూడా అదే విధంగా ఆకర్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు, కొంత వరకు ఫలించే అవకాశం కూడా ఉందని సమాచారం.ఈ విషయాలు ఆశాజనకం గా కనిపిస్తున్నప్పటికీ, నరేన్ వర్గం నుంచి రెండు రోజుల్లోనే 4 బహిరంగ ప్రశ్నలతో వచ్చిన వీడియో, ముందు ముందు జరుగబోయే తీవ్ర పరిణామాలు,వాటివల్ల జరుగబోయే నష్ఠాలపై ఆందోళన కలిగించేదే. దీనికి తోడు నరేన్ వర్గంపై ఉన్న వ్యతిరేక ఓట్లను గంప గుత్తగా కొల్లగొట్టే చాకచక్యం ‘గోగినేని’ కి ఉందని, సంప్రదాయంగా రెండు వర్గాలపై ఉండే వ్యతిరేకత కూడా ఆయనకే కలసి వస్తుందని అందరూ భావించడం ‘త్రిముఖ’ పోటీలో చాల ప్రమాదం అని భయపడుతున్నారు.వీటికి తోడు ‘ఆయారాం గయారాం’ ల మూలం గా వచ్చే లాభంతో పాటు చేటు కూడా వచ్చే ప్రమాదం ఉందని, గల్లీ నాయకుడు తిప్పే చక్రం స్పీడుకు తమకు కూడా కళ్ళు తిరుగుతాయేమో చూసుకోమని సన్నిహితుల సలహా. వీళ్ళ కప్ప గంతుతో కళ్లెర్రజేస్తున్న బే ఏరియా పెద్ద స్వయంగా రంగంలోకి దూకటం ఏదైనా పెద్ద ప్రమాదం తెస్తుందేమోనని పరిస్థితుల్ని అతి జాగ్రత్తగా గమనిస్తున్నారు.ఈ గందరగోళంతో తమ ప్యానెల్ కూర్పును కూడా కొంతకాలం ఆపారు.వెరసి భవిష్యత్తు కొంత ఆశాజనకంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ ,ప్రమాదాలు కూడా అంతే ఆందోళనకరంగా ఉన్నాయి.
శృంగవరపు వర్గం సంక్రాతి పండుగ సందర్భగా పాడుకొంటున్న పాటలు..
పైకి:అదిగో నవలోకం వెలసే మన కోసం,దూర దూర తీరాలకు సాగుదాం! సాగి ఇంద్రలోక సభలో ఆగుదాం! ఎచట సుఖముందో, ఎచట అమృతం కలదో అచట మనముంటామా??
లో లోపల:ధనమేరా అన్నిటికి మూలం,ఆ ధనం విలువ తెలుసుకొనుటే మానవ ధర్మం!మానవుడే ధనమన్నది సృష్టించెనురా,దానికి తానే తెలియక దాసుడాయెరా! ధనమేరా అన్నిటికీ మూలం.
నరేన్ కొడాలి వర్గం:సాంప్రదాయకంగా ఎంతో బలమైన వర్గమైనప్పటికీ, అత్యంత సన్నిహితులుగా భావించినవారి కప్పదాటు మూలంగా,ఎదురైన పరిస్థితుల్ని సరిదిద్దటం కష్టంగానే ఉంది.తాము ఈ గందరగోళంలో ఉండగానే మిగతా ఇద్దరు అభ్యర్థులు పోటీ ప్రకటించడంతో తాము కూడా ప్రకటించాల్సి వచ్చింది. తమ ప్యానెల్లో ముఖ్య పదవులకు తగిన అభ్యర్థుల వేట ఇంకా కొనసాగుతుండగా,పోటీ చేయమని అడుగుతున్నవారిలో చాలామంది ఎదో ఒక కారణంతో తప్పించుకొంటున్నట్లు తెలుస్తోంది.ఈ వర్గం కరుణ కోసం వినమ్రంగా ఎదురుచూసే పరిస్థితి నుండి తాముగా అడిగినా దూరంగా పరుగెత్తే పరిస్థితికి, ప్రస్తుత ‘త్రిముఖ’ పోటీలో గెలుపు ఓటములపై ఎవరికీ నమ్మకంగా లేకపోవడమే ముఖ్యకారణం.తాము కరుణిస్తే అనామకుడు కూడా నాయకుడిగా అవతరించే పరిస్థితి నుంచి, నాయకుడు కూడా పోటీ నించి పారిపోయే పరిస్థితి గమనించి దూరంచేసుకున్న నాయకుల్ని దగ్గిరచేసుకునే దార్లు వెతుకుతూ,శతధా మధన పడ్తున్నట్లు సమాచారం.వర్గంలోపెద్ద దిక్కు స్వయంగా రంగంలోకి దిగి తనను వెన్నుపోటు పొడిచిన వారి అంతు తేల్చే పనిలో ఉండగా,ఇంకో యువ నాయకుడు కాగడా చేతపట్టుకుని అనేక నగరాల్ని సందర్శించుకొంటూ,చెదురు మెదురైన నాయకులని దగ్గరి చేసుకునే ప్రయత్నాలను తీవ్రంగా చేస్తున్నట్లు పక్కా సమాచారం.అందులో పాక్షికం గా ఫలితాలు సాధిస్తుండటం కొంత ఊరటే. అంతేకాక స్వంత బలం తోపాటు ‘గోగినేని’ అవతలి వర్గం నుంచి చీల్చుకొనే ఓట్లు కూడా తమకు ‘శ్రీరామరక్ష’ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కొడాలి వర్గం సంక్రాతి పండుగ సందర్భగా పాడుకొంటున్న పాటలు..
పైకి :అందరూ కోరస్ లో:భళి భళి రా బాహుబలి, సాహోరే బాహు బలి, ఈ హారతి నీకే పట్టాలి నీకే పట్టాలి నీకే పట్టాలీ (ఇంకా చాలా సార్లు )
లో లోపల:#1.ఎవరికోసం ఎవరున్నారు, పొండిరా పోండి, కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి! ఉన్న వాడిదే రాజ్యంరా లేనివాడిది పూజ్యంరా, పొండిరా పోండి ..డోంట్ కేర్!
#2.ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ? విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు? కంచెయే తానుగా చేను మేసినా కాదను వారెవరూ? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ?
#3.పంతం పంతం పంతం నీదా నాదా సై,సొంతం సొంతం సొంతం నీకా నాకా హై!భగ భగ భగ భగ మరిగే రోషం మాదే మాదే సై,తెగ తెగ తెగ తెగ పైకెగిరిన పందెం మాదే మాదే హై! వేద్దాం హై, చూద్దాం సై,వేద్దాం హై,చూద్దాం సై!
లావు బ్రదర్స్: లాస్ట్ టర్మ్ ఎన్నికల ప్రహసనంలో ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకొని గట్టెక్కి,ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాలు బంధు మిత్రులతో ఘనంగా జరుపుకొంటున్నారు. క్రితంసారి ఎదో రకంగా సాయంచేసిన వారు తిరుగు సాయం ఆశిస్తుండగా,నష్టం చేయబోయిన వారు భయం భయంగా మసలుతుండగా, ఏ భయం లేని వీరు..
సంక్రాతి పండుగ సందర్భగా పాడుకొంటున్న పాటలు.
పైకి :మనుసున ఉన్నది చెప్పాలని ఉన్నది,మాటలు రావే ఎలా?మాటున ఉన్నదీ, ఓ మంచి సంగతీ, బయటికి రాదే ఎలా? ఎలా??
లో లోపల:భలే మంచి రోజు, పసందైన రోజు,వసంతాలు పూసే నేటి రోజు గుండెలోని కోరికలన్నీ,గువ్వలుగా ఎగిరిన రోజు, గువ్వలైన ఆ కోరికలన్నీ,గూటికి చేరిన రోజు! భలే మంచి రోజు, వసంతాలు పూసే నేటి రోజు!