అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన 2023-25 టర్మ్ ‘తానా’ ఎన్నికలు ఈ మధ్యనే ముగిసి నరేన్ కొడాలి ఆధ్వర్యంలోని ప్యానెల్ ఏకపక్షంగా పదవులన్నీ కైవసం చేసుకున్న విషయం విదితమే.
ఈ ఎన్నికలు ఐనంపూడి కనకంబాబు గారి ఆధ్వర్యంలోని ఎన్నికల కమిటీ పర్యవేక్షించగా వారు గతం నుంచి ‘తానా’ తో పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల నిర్వాహకులైన ‘ఎలక్షన్ ట్రస్ట్’ ద్వారానే ఎలక్ట్రానిక్ తరహాలో ఎన్నికలు నిర్వహించారు.
వారి ద్వారా సమర్పించబడిన వివరాలతో కూడిన ఎన్నికల ఫలితాలను ‘తానా’ ఎలక్షన్ కమిషన్ ధ్రువీకరించి ‘తానా’ బోర్డుకు పంపారు.
రెండు సంవత్సరాలకు పైగా హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఇంచుమించు అన్ని జాతీయ పదవులను గెలుచుకొన్న టీం కొడాలి కి అనేక మంది అతిరథ మహారధులు సహకరించారు.
ముఖ్యంగా నరేన్ కొడాలి తో పాటు పోటీలో ఉన్న లావు శ్రీనివాస్, రవి పొట్లూరి, రాజా కసుకుర్తి, భరత్ మద్దినేని ప్రత్యక్షంగా ముఖ్య భూమిక పోషించగా, అదే ప్యానెల్ సభ్యులైన భక్త బల్లా, లోకేష్ నాయుడు,సునీల్ పాంత్రా, వెంకట్ కోగంటి, ఠాగూర్ మలినేని, సతీష్ కొమ్మన, నాగ పంచుమర్తి, శ్రీనివాస్ కూకట్ల తదితరులు విశేష కృషి చేశారు.
అలాగే ఈ టీంకు ముఖ్య మద్దతుదారులుగా మునపటి అధ్యక్షులైన ప్రముఖులు గంగాధర్ నాదెళ్ల, జయరాం కోమటి, సతీష్ వేమన, అంజయ్య చౌదరి లావు, మోహన్ నన్నపనేని లతో పాటు శశికాంత్ వల్లేపల్లి, వాసు కొడాలి, జానీ నిమ్మలపూడి, హేమ కానూరి, అనిల్ ఉప్పలపాటి తదితరులు ఆహర్నిశలు కృషిచేసి అన్ని విధాలా వెన్నుదన్నుగా నిలిచారు.
అంతేకాక ఎన్నికల కీలక దశలో నరేన్ పూర్వ ప్రత్యర్థి మరియు సీనియర్ అయిన శ్రీనివాస గోగినేని నరేన్ కొడాలి కి మద్దతుగా పోటీ నుంచి విరమించుకొని వ్యూహాత్మకంగా మొత్తం ప్యానెల్ విజయానికి సహకరించటాన్ని ఒక ‘గేమ్ ఛేంజర్’ గా పలువురు భావిస్తున్నారు.
ఏదేమైనా ఎన్నికలు సజావుగా ముగిసి ఫలితాల వెల్లడితో తుఫాను ముగిసిన తర్వాత ప్రశాంతత ఆవరించినట్లు ‘తానా’ నాయకులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘తానా’ బోర్డ్ ఫార్మల్ గా ధృవ ధరించవలసిన ఎన్నికల ఫలితాల పూర్తి అధీకృత డాక్యూమెంట్ ను క్రింద చూడవచ్చు.
అలాగే ఈ వివరాలను తానా అధీకృత వెబ్సైటు లింకు https://www.tana.org/about/elections లో కూడా చూడవచ్చును.