సుమారు రెండు మూడు నెలల క్రితం ‘తానా‘ చరిత్రలో కానీ వినీ ఎరగని విధంగా యుద్ధ వాతావరణం లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా కూటమి కట్టిన ప్రస్తుత (లావు) మరియు క్రితం (తాళ్లూరి) అధ్యక్షుల వర్గాలు అంతకుముందు చాలా కాలం నుండి ఆధిపత్యం నిలుపుకొస్తున్న వర్గాన్ని కొద్ది శాతం తేడాతో ముఖ్యంగా బాలట్ కలెక్షన్ ప్రక్రియలో ఓడించటం మనందరికీ ఇంకా గుర్తే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ‘తానా‘ నాయకత్వంలో జరిగిన, జరుగుతున్న వ్యవహారాలు ‘నమస్తే ఆంధ్ర‘ పాఠకుల కోసం టూకీగా తెలుపుతున్నాం.
‘జయ్ తాళ్లూరి‘ పదవీకాలం పరిసమాప్తి
సౌమ్యుడు, సహనశీలి గా పేరు తెచ్చుకుని ఆర్థికపరంగా, కుటుంబ నేపధ్య పరంగా బలమైన అభ్యర్థిగా మొదలై అప్పటివరకూ అధిపత్యం చెలాయిస్తున్న వర్గంతో కయ్యం పెట్టుకోకుండా ఇచ్చిపుచ్చుకుని, అత్యధిక మంది మద్దతు సంపాదించటం తోపాటు అమెరికా వ్యాప్తంగా ‘తానా‘ సభ్యత్వాలను ఇబ్బడిముబ్బడిగా చేర్పించడం తో ‘తానా‘ అధ్యక్షుడిగా ఎన్నికై నందున ఆయన అధ్యక్ష పదవి కాలం పై పెద్ద పెద్ద అంచనాలున్నాయి. దురదృష్టవశాత్తూ పదవీకాలంలో అధికభాగం కోవిద్ మహమ్మారి మూలంగా సంభవించిన గడ్డుకాలంలో కూడా వీలైనంతవరకు మంచి కార్యక్రమాలు నిర్వహించినట్లే చెప్పుకోవచ్చును. కాకుంటే చివరి మాసాల్లో తన వర్గానికి చెందిన వ్యక్తికి భవిష్యత్తు అధ్యక్షునిగా ఎన్నికకై ‘లావు‘ల వర్గంతో కలిసి నడిచి కొద్ది తేడాతో గెలిచినప్పటికీ పదవి ముగిసే సమయానికి సగం మంది సభ్యులతో వ్యతిరేకత తెచ్చుకున్నట్లే భావించాలి. దానికి తోడు ఇప్పటివరకూ ఎన్నడూ జరగని విధంగా కోవిద్ కారణంగా ‘తానా‘ కాన్ఫరెన్స్ చేయలేక పోవడం దురదృష్టకరమేగాక ఒక విధంగా నిరాశాజనకం. ఇంకో రెండు మూడు నెలలు పదవీకాలాన్ని పొడిగించుకుని మినీ కాన్ఫరెన్స్ నైనా చేయాలనే ప్రయత్నాలకు తమతో కలసి నడిచినవారే సహకరించకపోవడం మాత్రం ఆయన వర్గానికి తీరని బాధ కలిగించినట్లు భోగట్టా.
లావు అంజయ్య కార్యవర్గం
అందరివాడు గా ప్రాచుర్యం కల్పించుకుంటూ, అమెరికా వ్యాప్తంగా ఒక వ్యూహంతో దీర్ఘకాలంపాటు సన్నిహితులను ఏర్పరుచుకుంటూ, ఆర్థిక బలమున్న మిత్రుల సహకారంతో ‘తానా’ సభ్యత్వాలను చేర్పిస్తూ, ఇంకా ‘తానా’ సభ్యత్వాలను కలిగివున్న వారితో ఇచ్చిపుచ్చుకునే పద్ధతి ఎప్పటికప్పుడు పాటిస్తూ, ఆధిపత్యం చెలాయిస్తున్నవారితో కయ్యం పెట్టుకోకుండా, అధ్యక్ష పదవికి అర్హత వచ్చీ రాగానే పదవి సాధించుకోగల్గడం అద్వితీయం.అత్యున్నత పదవి చేతిలోకి రాగానే తమ మంత్రాంగంలోకి జై తాళ్లూరివర్గాన్ని కూడా లాగి పదవుల్లో సింహభాగాన్ని తమ అట్లాంటా బ్రదర్స్ గుప్పిట్లోకి వచ్చేలా ఎన్నికల సమరాన్నినడిపి ‘తానా’ భవిష్యత్తు మీద తమ ఆధిపత్యం నిలిచే విధంగా వ్యూహరచన జరుపుతున్నట్లు భోగట్టా. జై తాళ్లూరి ఆశించిన పొడిగింపు జరగకపోవడంతో ‘తానా’ కాన్ఫరెన్స్ కోలాహలంగా జరిగే అవకాశం లేనప్పటికీ, నిర్ణీత సమయానికే అంజయ్య కార్యవర్గం కొలువుదీరింది.
చాలా కార్యక్రమాలు చేసే ఉత్సాహం గట్టిగానే కనిపిస్తుంది గాని పదవీకాలం పొడిగింపులో సహకరించలేదని గొణుక్కుంటున్న జయ్ తాళ్లూరి వర్గం ఎంతవరకు సహకరిస్తుంది, అలాగే భీకర ఎన్నికల యుద్ధంలో అవసరం లేకుండానే అతిగా తలదూర్చినందున సుమారు సగం ఓట్లు సాధించి, ఓడిన వర్గం నుంచి ఎటువంటి సవాళ్ళు ఎదురవుతాయనేది వేచిచూడాల్సిందే. ఇప్పటికే గత కాన్ఫరెన్స్ లెక్కలపై చేసిన ఎలక్షన్ విమర్శల మూలంగానూ, ఖర్చుతో కూడిన అట్లాంటా నగరంలో ఒక ‘తానా’ కాన్ఫరెన్స్ మిస్ అయిన తర్వాత జరిగే ‘తానా’ కాన్ఫరెన్స్ ను మారిన ప్రస్తుత పరిస్థితుల్లో చేయగలరా అని కూడా గుసగుసలు సాగుతున్నాయి. ఎంతోమంది తలదూర్చిన ఈ ఎన్నికల్లో చాలా మందికి ఉన్న పదవీ దాహాన్ని నామకేవాస్తే కమిటీలతో ఎంతవరకు సర్దిచెప్పగలరో అని చర్చలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ అధిగమించి సంస్థను సజావుగా నడపగలరనే ఆశిద్దాం.
‘తానా’ ఫౌండేషన్
ఎన్నికల్లో గెలిచిన కూటమి లో ఏ వర్గానికి చైర్మన్ పదవి దక్కాలి అనే చర్చ సాగి సాగి ఎటూ తేలక, మధ్యే మార్గంలో ‘వెంకటరమణ యార్లగడ్డ’ పరమైంది. కొంతమంది నుంచి ఓడిన వర్గానికి చెందినవారనే అభ్యంతరమొచ్చినా అంతకుముందు కీలకమైన ట్రెజరర్ పదవిని నిర్వహించడంతో పాటు అనేక కార్యక్రమాలు ఒంటిచేత్తో చేసిన చరిత్ర కారణంగా ‘శశికాంత్ వల్లిపల్లి’ సెక్రటరీ గా ఎన్నిక వగా, ‘ శ్రీకాంత్ పోలవరపు’ ట్రెజరర్ గా ఎన్నికయ్యారు. వీరి ఆధ్వర్యంలో మారిన పరిస్థితుల్లో మంచి కార్యక్రమాలతో పేరొందిన ‘తానా’ ఫౌండేషన్ యధావిధిగా తెలుగు ప్రజలకు సేవ చేస్తారని ఆశించవచ్చును.
‘తానా’ బోర్డు
‘తానా’ ఫౌండేషన్ పంధాలోనే కూటమిలో ఏ వర్గానికి కాకుండా మాజీ అధ్యక్షులైన ‘డాక్టర్ హనుమయ్య బండ్ల’ ను చైర్మన్ గా ఎన్నుకొని మిగిలిన పదవులైన సెక్రెటరీగా ‘డాక్టర్ నాగేంద్ర కొడాలి’ మరియు ట్రెజరర్ గా ‘లక్ష్మి దేవినేని’ లను ఎన్నుకున్నారు. మారిన పరిస్థితుల్లో ఎటువంటి సంచలనాలకు తావులేకుండా సాగిపోవచ్చని పలువురు భావిస్తున్నారు.
కూటమిలో లుకలుకలు మొదలేనా?
పైన చూపిన వ్యవహారాలను బట్టి, అనేక మంది ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి, గత పదవీ పదవీకాలాన్ని పొడిగించలేకపోవడాన్నిబట్టి, పదవుల పంపకం జరిగిన విధానాన్ని బట్టి, రెండు వర్గాలకు చెందిన అనేకమంది అభిప్రాయాల్ని బట్టి కూటమి కొత్త కాపురం సాఫీగా లేదని తెలుస్తోంది. గెలుపు అనే ‘పెళ్లి సందడి’ తర్వాత జరిగే ‘హనీమూన్’ కార్యక్రమం లేకుండా పోవడం విధి వైపరీత్యం అనుకోవాలా, ఆధిపత్యపోరు అనుకోవాలా, ఆరంభ శూరత్వమానుకోవాలా లేక ఇది కూడా కోవిద్ ఖాతాలో వేసేయ్యలా అనేది నిలకడగా తెలుస్తుంది. ఏదేమైనా పప్పులో రాయి పడినట్లే పలువురు భావిస్తున్నారు.
కళ్ళు తిరిగిన గత అధిష్టానంకు తెలివి వచ్చిందా?
అనేక ఏళ్లపాటు ఆధిపత్యానికి ఎదురు లేకుండా చేసుకుని, దాంతో తలకెక్కిన తలబిరుసుతో అనేకమంది సీనియర్లను, సేవాతత్పరులను, పనిమంతులను కాదని పక్కనపెట్టి, కొన్ని సందర్భాల్లో అవమాన పరచి మరికొన్నిసార్లు ఏకాకిని చేసి తమకు ఒదిగివుంటారని కొంతమందికి, ఆర్థిక బలం ఉందని కొంతమందికి, పెద్దల అండ ఉందని కొంతమందికి, ఓట్లు చేర్చుకున్నారని కొంత మందికి పదవులు పంచుతూ ఎల్లకాలం తమకు ఎదురు ఉండదు అని కళ్ళుమూసుకున్న సమయంలో గురి చూసి తమ ప్రాపకంతోనే పైకి వచ్చిన వారు కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి ఇప్పుడిప్పుడే తెలివివస్థున్నట్లు తెలుస్తోంది. తమతోనే ఉంటూ రెండో వైపు కూడా సాన్నిహిత్యం నెరిపిన కొంతమందితో పాటు అనేక ఎన్నికల రహస్యాలు బయటపడుతూ ఎవ్వరినీ నమ్మలేని పరిస్థితి దాపురించినట్లేవుంది. చెప్పుకోదగిన టీం లేక ఓడినప్పటికీ ఇంచుమించు సగం ఓట్లు సంపాదించినా, గెలిచిన కూటమి అప్పుడే బీటలు వారుతున్నట్లు కనపడుతూ ఆశలు గొలుపుతున్నప్పటికీ, రాబోయే సమయానికి సరిపోయే, పోరాట పటిమ కలిగి, నమ్మదగిన నాయకుల్ని గుర్తించడం కష్టంగానే ఉన్నట్లుంది. ఈ విషయంలో వెంటనే కార్యాచరణ గుంభనంగా చేసుకోకపోతే తమతో ఉన్నవారు కూడా గెలిచిన కూటమిలో ఏదో ఒక వర్గం వైపు మరలడం ఖాయం.
ప్రస్తుత కార్యవర్గాలకు ‘నమస్తే ఆంధ్ర‘ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘తానా‘ నాయకులు సమాజ అవసరాలకు తగినట్లుగా మంచి కార్యక్రమాలతో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అటువంటి కార్యక్రమాలకు జేజేలు పలుకుతూ సంస్థలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు పాఠకుల దృష్టికి తేవడం జరుగుతుంది.