ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న-అన్న సూక్తిని పాటిస్తూ, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ‘చేయూత’ పథకం కింద పేద విద్యార్థులకు ఆపన్న హస్తం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే `పడాల ట్రస్ట్`తో కలిసి తానా ఫౌండేషన్ ‘చేయూత’ 83 మంది నిరుపేదలైన విద్యార్థులకు ఈ ఏడాది కూడా స్కాలర్ షిప్పులు పంపిణీ చేసింది. ఈ నెల 20న తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉన్న గాంధీ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ స్కాలర్ షిప్పుల పంపిణీ చేపట్టారు.
స్కాలర్ షిప్పులు అందుకున్న వారిలో బ్యాచలర్ డిగ్రీ విద్యార్థులు ఉన్నారు. మొత్తం 83 మంది విద్యార్థుల్లో 45 మందికి గత మూడేళ్లుగా స్కాలర్ షిప్పులు పంపిణీ చేస్తున్నారు. వీరినే మరోసారి ఎంపిక చేసి పంపిణీ చేశారు. ‘శశికాంత్ వల్లేపల్లి’ కుటుంబం మరియు ఐశ్వర్య శ్యామ్‌రాజ్ ఈ స్కాలర్ షిప్పులు అందించారు.
ఈ సందర్భంగా పడాల ట్రస్ట్ చైర్మన్ సూర్య పడాల గారు ‘తానా’ అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మరియు ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ వెంకట రమణ యార్లగడ్డ గార్లతో తనకున్న అనుబంధాన్ని వివరించారు.‘తానా’లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.
అయితే, ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా ప్రొటోకాల్‌ను పాటిస్తూ, అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం. స్కాలర్ షిప్పులు అందుకున్న ప్రతి విద్యార్థినీ నిర్వాహకులు అభినందించారు. విద్యలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.