‘తానా’ ఎలక్షన్ విషయమై గత కొద్ధి రోజులుగా వివిధ వర్గాల నాయకుల మధ్య , సీనియర్ సభ్యుల మధ్య జరుగుతున్న చర్చలు ఒక వారం తర్వాత కూడా సద్దుమణగకపోగా మరింత చర్చకు దారితీస్తున్నట్టుగా తెలుస్తోంది.ముఖ్యం గా గతంలో పోటీచేసిన ‘శ్రీనివాస గోగినేని’ కూడా రంగంలో ఉండొచ్చు అన్న విషయము, ఆయన గతంలో ‘తానా’లో విధులు నిర్వహించిన తీరు , ముక్కుసూటి తత్త్వం ఈ ఆసక్తికి కారణం అని చెప్తున్నారు. ఇంతవరకు పోటాపోటీగా గెలుపు పై ధీమా గా ఉన్న ‘నిరంజన్ శృంగవరపు’, ‘నరేన్ కోడాలి ‘వర్గాలు ‘శ్రీనివాస గోగినేని’ కూడా రంగం లో ఉంటే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే విశ్లేషణలు చేస్తున్నట్లు సమాచారం. సందట్లో సడేమియాల్లాగా ఇంకో ‘ఇద్దరు ముగ్గురు’కూడా అదృష్ఠంని పరీక్షించుకుంటే ఎలావుంటుందని తమను సమర్ధిస్తారని అనుకుంటున్న పెద్దలతో మాట్లాడుతున్నట్లు చెప్పుకుంటున్నారు
‘ప్రెసిడెంట్ ‘పదవికి పోటీ అనివార్యమేమో అనిపిస్తున్న పరిస్థితుల్లో సాధారణంగా అంతగా పట్టించుకోని మిగతా పదవులకు కూడా పోటీ పెరిగింది. ఇప్పుడు ఉన్న పలువురు నాయకులతో పాటు, గతంలో కొన్నిపదవుల్లో ఉన్నవారు, సరికొత్త ఉత్సాహవంతులు కూడా పోటీ పై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలక్షన్ సమయాల్లో అందరితో మాట్లాడుతూ , పదవులు మధ్య పరస్పరాంగీకారం కోసం ప్రయత్నిస్తూ ‘అధిష్ఠానం’గా భావించుకొనే పెద్దలు ఈ పరిణామాలతో తలలు పట్టుకుంటున్నట్టు, ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని ఆందోళన చెందుతున్నట్లు వారితో నిత్యం టచ్ లో ఉండేవారి ద్వారా తెలిసింది
వెరసి సాధారణంగా 90 శాతం అటూ ఇటూ పదవులు మార్చుకునే పద్దతి గాకుండా ఈ సారి కొత్త చైతన్యంతో ‘తానా’ కార్యవర్గాలు సమకూరే అవకాశాలు పుష్కలంగా ఉండేటట్లు భావిస్తున్నారు.అలా జరిగితే చాలా మంచిది అని పాత తరంలో ముఖ్యమైన పదవులు నిర్వహించి, ప్రస్తుతం దూరం నుంచి పరిస్థితుల్ని గమనిస్తూన్న అనేక మంది ‘తానా’ శ్రేయోభిలాష్షులు అభిలషిస్తున్నారు .అదే జరిగితే ఇంకా చైతన్యవంతమైన సరికొత్త ‘తానా’ ను త్వరలో చూస్తామేమో.