చీలిక దిశగా రెండు వర్గాలు ప్రచార ఉధృతి
తెలుగు సమాజ ఐక్యత దిశగా ‘గోగినేని’
‘తానా’ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు వచ్చిన సందర్భంగా ఎన్నికల సంగ్రామం ఏ విధముగా ఉండబోతుందో క్రమక్రమంగా స్పష్టమవుతోంది. గత వారాంతంలో జరిగిన బోర్డు మీటింగ్ రికార్డు స్థాయిలో 9 గంటల పాటు జరిగి, మరింత వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ తిరస్కరించిన ‘భక్త బల్లా’, ‘హేమచంద్ర కానూరి’ మరియు ‘సుమన్ రామిశెట్టి’ ల నామినేషన్లను బోర్డు కూడా తిరస్కరించినట్లు, ముగ్గురూ ఇంతకు ముందు నుంచి ‘తానా’ కు వివిధ పదవుల్లో పనిచేసి ఉన్న కారణంగానూ, తిరస్కరణకు గురైన విధానంలో కొన్ని వెసులుబాట్లు కారణంగానూ, బోర్డు ఆమోదించే అవకాశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ ఫక్తు రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు ఎక్కువమంది భావించడం ‘తానా’ వంటి స్వచ్చంద సంస్థకు మేలు కాదని చెప్తున్నారు. అలాగే ‘బినామీ అడ్రస్ ప్రూఫ్’ లతో వివాదాస్పదమైన ‘4000 అడ్రస్ మార్పుల’ పై కూడా ‘న్యూట్రల్ థర్డ్ పార్టీ కమిటీ ‘కాకుండా ఇంటర్నల్ బోర్డు సభ్యులు మరియు వారి అనుచరులతో వ్యవహారం నడుపుతుండడం కూడా వివాదాస్పదంగానే ఉంది. ఈ పనికి మరికొంత సమయం పట్టే కారణంగా బాలట్లు పంపే సమయము మరి కొద్దిరోజులు ఆలస్యంకావచ్చునని తెలుస్తోంది. ఇక రెండు మూడు రాష్ట్రాల మినహా అన్నిచోట్లా స్థానిక ప్రతినిధుల ఎన్నికలు ఏకగ్రీవం కావటం ‘తానా’ తెలుగు సమాజానికి కొంత ఊరటనిచ్చింది.
ఇక రెండువర్గాలుగా చీలి పోటీ పడుతున్న వారు తమ తమ వ్యూహాలకు పదును పెడుతూ అన్ని రాష్ట్రాలలో మద్దతుదారులను ఉత్సాహపరచుకొంటూ రెండో వర్గం పై నిఘా పెడుతున్నారు. ‘కొడాలి’ మరియు ‘శృంగవరపు’ వర్గాలు రెండూ కోవిడ్ విషయాన్ని కూడా లెక్క చేయకుండా అనేక నగరాలూ తిరుగుతూ పర్యటనలు ఖరారు చేసుకోవటం వారిద్దరికీ ఉన్న అభద్రతా భావాన్ని, అలాగే పోటీ వాతావరణాన్ని తెలియచేస్తోంది. స్వచ్చంద సంస్థల్లో సాధారణంగా పాటించే నియమాలకు విరుద్ధంగా ప్రస్తుత అధక్షుడు ‘జయ్ తాళ్లూరి’, అందరి మద్దతు సహాయ సహకారాలతో పోటీ లేకుండా పదవి పొందిన తదుపరి అధ్యక్షుడు ‘అంజయ్య లావు ‘బహిరంగంగా ఒక వర్గానికి వత్తాసు పలకటంపై అమెరికా వ్యాప్తంగా నిరసన వ్యక్తమైనప్పటికీ, తిరిగి అదే పని ఇంకా బహిరంగంగా చేస్తూ ఎన్నికల ప్రచారానికి వివిధ రాష్ట్రాలకు పర్యటన ఏర్పాట్లు చేసుకోవడంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యం గా వారి స్వంత ప్రదేశాలైన అట్లాంటా, న్యూ యార్క్, న్యూ జెర్సీ లోనే కాక ,వారు వెళ్లే ప్రదేశాల్లోకూడా సభ్యులు వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు. ఇది చివరికి ప్యానెల్ కు వ్యతిరేక పవనంగా మారే ప్రమాదం కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ప్రయత్నానికి ముఖ్య కారణము గా తాము సమర్ధించే ప్యానెల్ మొత్తం లో ప్రముఖమైన లేదా లీడ్ చేయగల ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం పెద్దలోపమని దానిని పూడ్చటానికి ఇంతకంటే వేరే మార్గం లేదని భావిస్తున్నప్పటికీ, ఇది కూడా వివాదాస్పదమై ఎదురు తిరుగుతుందేమోనని తర్జన భర్జన పడ్తున్నారు.
కొద్ధి నెలల క్రితం వరకు కలసి ఉండి అకస్మాత్తుగా రెండు వర్గాలుగా చీలి పూర్తి పానెల్స్ గా ఏర్పడి తెలుగు సమాజాన్ని రెండు వర్గాలుగా దీర్ఘకాలంపాటు చీల్చే విధంగా ప్రచారాలు జరుపుకోవడం పై చాలా మంది నిరసన వ్యక్త పరుస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో , వివిధ వర్గాల పరిస్థితి ఏ విధంగా గోచరిస్తుందంటే–
శ్రీనివాస గోగినేని: వివాద రహితుడు, వర్గాలకు అతీతుడై గతం లో ‘తానా’ ఫౌండేషన్ చైర్మన్ తో పాటు, కాన్ఫరెన్స్ సెక్రటరీ, దీర్ఘ కాలం బోర్డు మెంబరు తో పాటు అమెరికాలోని అనేక నగరాల్లో ‘మన ఊరికోసం’ నినాదం తో చేసిన ‘5కే వాక్/రన్’ లకారణం గానూ, గతంలోనే ఒకసారి అధ్యక్షపదవికి పోటీ చేసిన కారణంగానూ ఉన్న గుర్తింపు తోడై ,ప్రస్తుతం పోటీ లో ఉన్న వారందరిలోకీ ఉన్నతుడుగానూ, ప్రముఖుడు గానూ మరియు అర్హుడు గానూ ‘తానా’ సభ్యులధికులు భావిస్తుండడం బాగా కలసివచ్చింది. దానికి తోడు అన్నిరాష్ట్రాల్లో తనకున్న అభిమానులు, మద్దతు దారులను తనదైన పద్దతిలో సమన్వయపరచుకొంటూ, సామాజిక,పేపర్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తన అభిప్రాయాలకు, విధానాలకు ప్రాచుర్యం కలిపించుకొంటూ వర్గపోరాటాన్ని బహింరంగంగా ఖండించగలిగే ధైర్యం, నిబద్దత మూలంగా ‘తానా ‘సాధారణ సభ్యులకు హాట్ ఫేవరెట్ గా మారారు. తనకు ఎందుకు ఓటు వేయాలో చెపుతూ, మిగతా పదవులకు పోటీ చేస్తున్న వారిలో అత్యధికమంది తో సన్నిహిత సంబందాల వలన ఏ విధంగా ‘తానా’ లో ఐక్యత రాబట్టగలనో స్పష్టంగా చెప్పుకుంటుండవలననూ, ఆయనకు ఎందుకు ఓటు వేయకూడదు అనేది ప్రత్యర్థులు చెప్పలేకపోవడం వలన ప్రెసిడెంట్ ఎలెక్ట్ పదవికి అందరిలోకీ ముందు ఉన్నట్టే లెక్క
Dr.నరేన్ కొడాలి: తన ప్యానెల్ ముఖ్య సభ్యులైన ‘భక్త బల్లా’,’హేమా కానూరి’ ల నామినేషన్లను కూడా సమన్వయంతో సరిగ్గా వేయుంచుకోలేని పరిస్థితిలో, ఫక్తు రాజకీయాకారణాలతో బోర్డ్ వీరి నామినేషన్లను తిరస్కరించినప్పటికీ ,ఎటువంటి ప్రతిఘటనను గాని, ప్రత్యర్థి వర్గం ‘అడ్రస్ మార్పు’ వ్యవహారం లో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నప్పటికీ, ఎదుర్కునే పటిమ ఇప్పటివరకూ చూపించకపోవడంపై, అయన వర్గంలోనే అయన నాయకత్వముపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరుగుతోందో అర్ధంకాక తన ప్యానెల్ సభ్యులు కొంత నీరసంగానే ఉన్నట్లు, తాము నమ్ముకున్న నాయకత్రయం బాహు బలులా లేక బాహు బలహీనులా తేల్చుకోలేక సతమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థాగతంగా సాంప్రదాయకమైన ఓటు బ్యాంకు కొంతవరకు అన్నిచోట్లా ఉండడటం, అలాగే ప్రత్యర్థి వర్గానికి అటువంటి వెసులుబాటు లేక తాము చేర్పించుకొన్న వోట్లపైనే ఆధారపడటం కొంతవరకు వెసులుబాటు కాగా, ఇప్పటికైనా జాగ్రత్తగా వ్యవహరిస్తే, అవకాశాలున్నట్లే భావిస్తున్నారు.అలాగే ముఖాముఖీ పోటీ గాక అధఃక్ష స్థానానికి త్రిముఖ పోటీ ఉండడటం, నరేన్ కు ప్రత్యక్ష కార్యక్రమ నిర్వహణాలలో అంతగా ప్రజా సంబంధాలు లేకపోవడం మూలం గా వెనకబడే ప్రమాదం ఉందనుకుంటన్నారు.
నిరంజన్ శృంగవరపు: ప్రస్తుత కార్యవర్గాలలో మద్దతుఉండటం నైతికంగా బలంగా అనిపిస్తున్నప్పటికీ వయసు, అనుభవము, గుర్తింపు రీత్యా ‘నిరంజన్’ మిగతా ఇద్దరిలో వెనుక బడి ఉండటంతో బాటు ఇదే కారణాలలో ‘శ్రీనివాస గోగినేని ‘మిగతా ఇద్దరికంటే ముందు ఉండటం ఇబ్బందికరంగా ఉంది. పైగా బాహుబలుల ప్యానెల్ పై ఉన్న వ్యతిరేకతను తమవైపు లాగుతానికి ప్రయత్నించినా, గత చరిత్ర లో వీరందరూ కలసి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నప్పటి నించీ పోరాడున్న ‘గోగినేని’ కే వ్యతిరేకఓటు పడే పరిస్థితి లో ఎలా వ్యవహరించాలో తెలియక తికమక పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత అధ్యక్ష, ఉపాధ్యక్షులు బహిరంగ మద్దతు పైకి బలంగా అనిపిస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో ఎంత ఉపయోగపడుతుందో నని లెక్కలు వేసుకుంటూ ఊరట పడ్తున్నట్లున్నారు. వెరసి ప్రెసిడెంట్ అభ్యర్థికి కొంత ఆందోళనకర పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్థున్నప్పటికీ, మిగతా ప్యానెల్ గట్టెక్కవచ్చని కంఫర్ట్ ఫీలవుతున్నారు కానీ తుది ఫలితం తమకు బలంగా భావిస్తున్న బాలెట్స్ కలెక్షన్స్ మీదే ఆధారపడి ఉండటం కొంత ఆందోళనకారమే.
నిజానికి ‘గోగినేని’ స్వచ్చంద ఓట్లపై నమ్మకం పెట్టుకోగా, రెండు వర్గాలు బాలట్ కలెక్షన్ల ప్రక్రియపై మల్లగుల్లాలు పడుతున్న ప్రస్తుత పరిస్థితిని కోవిద్ సమయంలో గమనిస్తున్న మనలాంటి వాళ్ళు పాడుకొనే పాట–
“అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా! నీ గుట్టు ఏమిటో తెలిసిందిలే, నీ బెట్టు దిగజారి పోతుందిలే! అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా!”