కోవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా కబళించిందో, ఎంతమందిని రోడ్డునపాలు చేసిందో అందరికీ తెలిసిందే. అమెరికాలో ఈ కోవిడ్ వల్ల ఎంతోమంది నిరుపేదలు ఇబ్బందులపాలయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని కమ్యూనిటీకి తనవంతుగా ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ముందుకు వచ్చింది. తానా కమ్యూనిటీ సర్వీస్ కో ఆర్డినేటర్ మల్లివేమన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని 150 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు.
అన్నీ దానాలలో అన్నదానం గొప్పదని మన పెద్దలు చెబుతుంటారు. ఎంతోమంది నిరుపేదలు తిండికోసం కష్టాలు పడుతున్నారని, అటువంటి వారిని ఆదుకోవడానికే తానా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని మల్లి వేమన చెప్పారు. ఈ సందర్భంగా 100,000 డాలర్ల విలువైన ఆహారపదార్ధాలను పంపిణీ చేయనున్నామని, 150 ప్రాంతాల్లో ఈ సహాయం చేయనున్నట్లు చెప్పారు. తానా తెలుగు రాష్ట్రాల్లో కూడా కోవిడ్ సహాయ కార్యక్రమాలను చేసిందని, ఎంతోమందికి అన్నదానం చేసిందని, అమెరికాలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలకు, ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, కార్యదర్శి రవి పొట్లూరి, ప్రెసిడెంట్ ఎలక్ట్ అంజయ్య చౌదరి లావు, తానా నేషనల్ కేర్స్ చైర్ జోగేశ్వరరావు పెద్దిబోయినకు మల్లివేమన ధన్యవాదాలు చెప్పారు