టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ పై సీనియర్ హీరో, దర్శకనిర్మాత అర్జున్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తన కూతురు ఐశ్వర్య విశ్వలతో ఒక సినిమాను చేస్తున్నానని, విశ్వక్సేన్ సడెన్ గా షూటింగ్ క్యాన్సిల్ చేసుకోవాలంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అర్జున్ షాకింగ్ ఆరోపణలు చేశారు. అయితే, తాను కొన్ని సూచనలు చేశానని, వాటిని ఏమాత్రం అర్జున్ పట్టించుకోవడంలేదని విశ్వక్సేన్ ఆరోపించాడు.
తన వేలో తాను కరెక్టేనంటూ సమర్ధించుకున్నాడు. ఈ క్రమలంనే ఈ వ్యవహారంపై సీనియర్ దర్శకనిర్మాత తమారెడ్డి భరద్వాజ స్పందించారు. అర్జున్ కు దర్శకుడిగా మంచి అనుభవం ఉందని, ఒకవేళ అర్జున్ చెప్పిన కథ నచ్చకుంటే, అర్జున్ అవుట్ డేటెడ్ అనుకుంటే విశ్వక్సేన్ అసలు ఈ ప్రాజెక్టు ఒప్పుకోకుండా ఉండాల్సిందని తమ్మారెడ్డి చెప్పారు. ఒకసారి సినిమా ఒప్పుకున్న తర్వాత మాటలు, పాటలు బాగాలేవని, దర్శకుడు చెప్పినట్టు వినడం కుదరదని అనడం సరికాదని తమ్మారెడ్డి చెప్పారు. ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారని, అందుకే ఎక్కువ సినిమాలు ప్లాప్ అవుతున్నాయని తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొత్త నిర్మాతలు, కొత్త దర్శకులు విభిన్న కథలతో వస్తున్నారని, కానీ కొంతమంది హీరోలు చెప్పినట్టు మార్పులు చేర్పులు చేయడం వల్లే సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటూ ఆశించిన ఫలితం రావడంలేదని అన్నారు. కొత్తగా వచ్చిన హీరోల్లో చాలామంది దర్శకుడి పనిలో జోక్యం చేసుకుంటున్నారని, ఫంక్షన్స్ లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఇష్టానుసారం మాట్లాడుతూ ప్రేక్షకులను ఇరిటేట్ చేస్తున్నారని విశ్వక్సేన్, విజయ్ దేవరకొండలను ఉద్దేశించి తమ్మారెడ్డి పరోక్షంగా చురకలంటించారు.
అర్జున్ చెప్పినట్లుగా చాలామంది నిర్మాతలు, దర్శకులు….హీరోలు చెప్పింది చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారని, ఆ పద్ధతిని మార్చుకోవాలని హీరోలకు తమ్మారెడ్డి హితవు పలికారు. విశ్వక్సేన్ చేసిన పని అర్జున్ కు మాత్రమే కాదని నిర్మాత, దర్శకుడు అయిన ప్రతి ఒక్కరికీ అవమానకరమేనని అన్నారు.