ఇండియన్ సినిమాలో బాహుబలి ఒక మైల్ స్టోన్ మాదిరి మారింది. భారత సినిమా రేంజ్ ను సమూలంగా మార్చేయటమే కాదు.. సినిమా మేకింగ్ విషయంలో కొత్త పుంతలు తొక్కేందుకు.. వందల కోట్లు సినిమాకు పెట్టుబడిగా పెట్టినా.. మరేం ఫర్లేదన్న ధీమాతో పాటు.. మంచి సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఉండే మార్కెట్ ఎంతన్న విషయాన్ని బాహుబలి చెప్పేసింది. అందుకే.. ఏదైనా ప్రిస్టేజియ్ ప్రాజెక్టు అని ఎవరైనా అన్నా.. భారీ ఎత్తున నిర్మిస్తున్నట్లుగా చెప్పినా.. వెంటనే బాహుబలి పోలిక తీసుకొచ్చేయటం ఈ మధ్యన ఎక్కువైంది.
అలాంటి మాటలకు కాస్తంత బ్రేకులు వేసేలా వ్యాఖ్యలు చేశారు తమిళ స్టార్ హీరో కార్తీ. తమిళ సినిమాలతో తెలుగువారికి సుపరిచితం కావటమే కాదు.. తన సినిమాలు అంటేనే ప్రత్యేకమైన మార్కు ఉంటుందన్న భరోసాను కల్పించారు. అలాంటి కార్తీ తాజాగా మణిరత్నం డ్రీం ప్రాజెక్టు ‘పొన్నియిన్ సెల్వన్’ భాగస్వామ్యం కావటం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వారికి కాస్తంత భిన్నంగా కార్తీ మాటలు ఉన్నాయని చెప్పాలి. మణిరత్నం నలభై ఏళ్ల కలను సినిమాగా మలిచిన వేళ.. ఆ మూవీని మరో సినిమాతో పోల్చటంపై తనకున్న ఇబ్బందిని తన మాటలతో చెప్పేశారు కార్తీ. పొన్నియిన్ సెల్వన్ మూవీ గురించి మాట్లాడినప్పుడు చాలామంది బాహుబలితో పోల్చినట్లు చెప్పారు కార్తీ.
‘‘బాహుబలి సినిమాలా ఉంటుందా? అని అడుగుతున్నారు. ఒక బాహుబలిని చూశాం. ఇంకో బాహుబలి అవసరం లేదు. మన దేశంలో బోలెడన్ని కథలు ఉన్నాయి. వాటిని మనం ప్రజలకు చెప్పాలి. ఇలాంటి ఒక గొప్ప సినిమాను మీరు తప్పక ఆదరిస్తారన్న నమ్మకం ఉంది’ అన్న కార్తీ మాటల్ని చూస్తే.. బాహుబలి ఫీవర్ నుంచి ఇకనైనా బయటకు రండ్రా అన్నట్లుగా ఉందని మాత్రం చెప్పక తప్పదు.