తమిళ హాస్య నటుడు వివేక్(59) గుండెపోటుతో మరణించారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన వివేక్…చికిత్స పొందులూ ఈ రోజు తెల్లవారుఝామున తుదిశ్వాస విడిచారు. వివేక్ ఆకస్మిక మృతితో తమిళ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. వివేక్ ఆకస్మిక మృతిపట్ల పలువురు భారతీయ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బాయ్స్, అపరిచితుడు, శివాజీ, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా వివేక్ సుపరిచితుడు.
మరోవైపు, తమిళనాట వివేక్ మృతిపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. వివేక్ రెండ్రోజుల క్రితమే కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. అంతేకాదు, ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 24 గంటల్లోనే వివేక్ పరిస్థితి విషమంగా మారి గుండెపోటు రావడం తమిళనాట చర్చనీయాంశమైంది. అయితే, కోవిడ్ వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ప్రముఖ దళిత నేత(వీసీకే పార్టీ అధినేత), ఎంపీ తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేక్ మరణంపై పలు ప్రశ్నకు సమాధానం రావాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వివేక్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోందని, దీనిపై తమిళనాడు ప్రభుత్వం తగిన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వివేక్ మరణానికి అసలు కారణాలు ఏంటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.