టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాకి బుల్లితెర ఎంట్రీ బ్యాడ్ ఎక్స్‌పీరియెన్స్‌గా మారింది. ఎన్నో యేళ్లుగా సినిమాల్లో తిరుగులేకుండా సాగుతున్న తమన్నా.. రీసెంట్గా ‘మాస్టర్ చెఫ్’ షోతో టెలివిజన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే సీజన్ పూర్తి కాకముందే సడెన్‌గా తమన్నా ప్లేస్‌లో అనసూయ ప్రత్యక్షమయ్యింది. దాంతో ఏం జరిగిందో అర్థం కాక ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో మాస్టర్ చెఫ్‌పై లీగల్ యాక్షన్ తీసుకోవాలని తమన్నా రెడీ కావడంతో స్టోరీ మలుపు తిరిగింది.
మాస్టర్ చెఫ్ నిర్వాహకులు చెప్పిన పేమెంట్ ఇవ్వలేదని, అన్‌ప్రొఫెషనల్‌గా ప్రవర్తించారని, అందుకే తమన్నా షో నుంచి తప్పుకుందని ఆమె తరఫు లాయర్ ఓ చానెల్‌తో చెప్పడంతో విషయం బైటికి పొక్కింది. అయితే అది ఏమాత్రం నిజం కాదంటోంది షోని ప్రొడ్యూస్ చేస్తున్న ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడెమీ. తమన్నాకి పేమెంట్ ఎగ్గొట్టలేదని, అన్‌ప్రొఫెషనల్‌గా ప్రవర్తించింది తాము కాదని, తమన్నాయేనని ఆరోపిస్తూ ఓ నోట్ విడుదల చేసింది.
ఇన్నోవేటివ్ సంస్థ చెబుతున్నదాని ప్రకారం.. వాళ్లు పద్దెనిమిది రోజుల షూట్ కోసం తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండు కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే పదహారు రోజులు షూట్ జరిగిన తర్వాత తమన్నా వేరే పనుల్లో బిజీ అయిపోయి వీరికి సమయం ఇవ్వలేదట. ఆమె ఎంతకీ షూట్‌కి రాకపోవడంతో అనసూయకి బాధ్యతను అప్పగించారట. పదహారు రోజుల షూట్‌కి 1.56 కోట్లు చెల్లించారట. మిగతా రెండు రోజుల షూట్ జరిగి ఉంటే ఆమెకి పూర్తి అమౌంట్ ఇచ్చేసి ఉండేవారమని తమ స్టేట్మెంట్లో పేర్కొన్నారు.
ఈ సీజన్ షూట్ పూర్తి చేయడానికి సహకరించకపోగా, రెండో సీజన్ పేమెంట్ ముందే ఇచ్చేయాలని కూడా తమన్నా డిమాండ్ చేసిందట. దాంతో తాము షాకయ్యామని, అందుకే హోస్ట్‌ని మార్చాల్సి వచ్చిందని అంటున్నారు సంస్థ ప్రతినిధులు. మూడొందల మంది క్రూతో జరిగే షూటింగ్‌కి ఆమె వల్ల చాలా ఇబ్బంది కలిగిందని, ఐదు కోట్ల పైనే లాస్ అయ్యామని చెప్పారు. ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్కైనా తాము సిద్ధమని, తమ దగ్గర అన్ని సాక్ష్యాలూ క్లియర్‌గా ఉన్నాయని, దయచేసి తమ గురించి తప్పుగా ప్రచారం చేయొద్దని మీడియాని కోరారు. మొత్తానికి మ్యాటర్ బాగా సీరియస్ అయినట్టే ఉంది. మరి దీనికి తమన్నా ఎలా రియాక్టవుతుందో!