తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) డిసెంబర్ 19 శనివారం రోజు క్రిస్మస్ సంబరాలు ఘనంగా అంతర్జాలంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో లండన్ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన పదికి పైగా చర్చిలకు సంబంధించి సుమారు 100 మంది తెలుగువారు మరియు తాల్ కార్యనిర్వాహక సభ్యులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వందలాది తెలుగువారు ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
లోకల్ ఎంపీ స్టీఫెన్ టీమ్స్ ప్రత్యేక అతిథిగా పాల్గొని సంబరాల్లో పాల్గొన్న వారికి మరియు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న ప్రజలకు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. తాల్ గత 15 సంవత్సరాలకు భిన్నంగా ఈ సంవత్సరం కోవిడ్19 ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్వహించిన సేవా కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలను కొనియాడారు. లండన్లో ఉన్న భారతీయ విద్యార్థులకు మరియు భారతదేశంలో కోవిడ్ ద్వారా ప్రభావితమైన తెలుగు వారికి తాల్ తమవంతు సహాయాన్ని అందించడాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
తాల్ చైర్మన్ భారతి కందుకూరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ క్రిస్మస్ సందేశాన్ని అందించారు. తాల్ గురించి ప్రస్తావిస్తూ గత 15 సంవత్సరాల నుండి తెలుగు భాష మరియు సంస్కృతిని లండన్ లోని తెలుగు సమాజానికి అందించే సదుద్దేశంతో కృషి చేస్తుందని తెలిపారు. అలాగే ఈ క్రిస్మస్ సంబరాలు విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన రవి మోచర్ల, రత్నాకర్ దార, జమీమ దార, డానియల్, ప్రవీణ్ మరియు కారోల్ దార లను ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమానికి లండన్ మరియు పరిసర ప్రాంతాలకు చెందిన తెలుగు పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఇతర పెద్దలు క్రిస్మస్ పాటలతో, సంగీతంతో వీక్షకులను అలరించారు. పాస్టర్ డానియల్, పాస్టర్ భరత్, బ్రదర్ ప్రభు చరణ్ బైబిల్ యొక్క ప్రత్యేకతను, ప్రభువైన యేసు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని స్తుతించారు. ఈ కార్యక్రమానికి రెవ్రెండ్ స్వరూప్ కుమార్ భారత దేశంనుంచి పాల్గొని తమ క్రిస్మస్ సువార్త సందేశాన్ని యూకే లో తెలుగు క్రైస్తవులకు అందించారు.
ఈ వేడుకల్లో తాళ్ ట్రస్టీలు రాజేష్ తోలేటి, గిరిధర్ పుట్లూర్, కిషోర్ కస్తూరి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, అనిల్ అనంతుల, నవీన్ గాదంసేతి మరియు అనితా నోములా తదితరులు వారితో పాటు ఐటి టీం వాలంటీర్లు రిషి కొత్తకోట, వంశీమోహన్, కిరణ్ కపెట్ట పాల్గొని తమ వంతు సహకారాన్ని అందించారు.
పాస్టర్ శ్రీమతి సలోమి, కరోనా కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఆవిడ తన దీవెనలతో తాల్ క్రిస్మస్ సంబరాలు 2020 కి ముగింపు పలికారు.