తాను పాల్గొనే ప్రతి సభలోనూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నోటి నుంచి వస్తున్న ముఖ్యమైన మాట క్లాస్ వార్. చంద్రబాబు గురించి..దత్తపుత్రుడు వపన్ కల్యాణ్ అని పేర్కొనటంతో పాటు ఎల్లో మీడియా అంటూ మూడు మీడియా సంస్థల పేర్లను అదే పనిగా ప్రస్తావించే ఆయన… గడిచిన కొంతకాలంగా క్లాస్ వార్ పేరును ప్రస్తావిస్తున్నారు. ధనవంతులు.. పేదల మధ్య జరిగే సంఘర్షణ.. వారి మధ్య ఉండే వర్గ పోరును అంతమొందించటమే తనలక్ష్యమన్నట్లుగా మాట్లాడుతుంటారు జగన్.
ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. సమాజంలో క్లాస్ వార్ లేని విధంగా తయారు చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పే ఆయన.. అందుకు బటన్ నొక్కి పేదల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నడుపుతున్న సంగతి తెలిసిందే. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్లు కట్టుకోవటానికి వీలుగా భూములు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన చేస్తున్నారు.
క్లాస్ వార్ ను రూపుమాపేందుకు వీలుగా అడుగులు వేయాలన్నదే జగన్ లక్ష్యమైతే.. అందుకు తగ్గట్లు.. తాడేపల్లిలో తాను నిర్మించుకున్న భవనం చుట్టూ ఉన్న భూమిని సేకరించి.. సెంటు స్థలం చొప్పున పేదలకు భూమి పంచొచ్చు కదా? అలా ఎందుకు చేయరు? పేదల కోసం పరితపించే జగన్.. ప్యాలెస్ లాంటి ఇంటిని వదిలేసి.. సామాన్యులకు అందుబాటులో ఉండొచ్చు కదా? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. అలాంటివి సాధ్యం కాదనే వాదనను కాదనలేం. అందుకే.. ఆయన నివాసం ఉండే తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్న భూముల్ని ప్రభుత్వం సేకరించి.. అందులో సెంటు చొప్పున.. లేదంటే రెండు సెంట్లు చొప్పున పేదలకు ఇళ్లస్థలాల కోసం భూములు ఇస్తే.. ఆయన చెప్పినట్లుగా క్లాస్ వార్ మాటను సీఎం జగన్ చేతల్లో చూపినట్లు అవుతుంది కదా? పేదల గుండెల్లో దేవుడిగా మారిపోతారు కదా? మరి.. ఆ దిశగా సీఎం జగన్ అడుగులు ఎప్పుడు వేస్తారో?