గడిచిన రెండు.. మూడు రోజులుగా వాట్సాప్ యూనివర్సిటీలోనూ.. సోషల్ మీడియాలోనూ ఒక అంశంపై వెల్లువెత్తుతున్న ఒక పోస్టు సారాంశం ఏమంటే.. స్విగ్గీ.. జొమాటో.. బిగ్ బాస్కెట్ లాంటి డెలివరీ యాప్ లతో ఇంటికే నేరుగా మద్యాన్ని సరఫరా చేసేలా నిర్ణయం తీసుకున్నారన్న వార్త వైరల్ గా మారింది. అయితే.. ఏయే రాష్ట్రాల్లో హోం డెలివరీ వ్యవహారం కొత్తగా షురూ కానుంది? అన్న దానిపై క్లారిటీ లేదు. అయితే.. ఇప్పటికే ఈ తరహాలో హోం డెలివరీ రాష్ట్రాలు ఏమేం ఉన్నాయి? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశంపై ఫోకస్ పెట్టారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఇళ్లకే మద్యాన్ని డెలివరీ చేసేందుకు వీలుగా కొన్ని రాష్ట్రాలు ప్లాన్ చేశాయి. ఇప్పటికే లిక్కర్ ను హోం డెలివరీ చేసే విధానం ఒడిశా.. పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. లాక్ డౌన్ వేళలో లిక్కర్ హోం డెలివరీ విధానానికి ఓకే చెప్పేసిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర.. జార్ఖండ్.. ఛత్తీస్ గఢ్.. అసోంలు ఉన్నాయి. ఇక.. కొత్తగా అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న రాష్ట్రాల విషయానికి వస్తే.. పలు రాష్ట్రాలు జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ జాబితాలో న్యూఢిల్లీ.. కర్ణాటక.. హర్యానా.. పంజాబ్.. తమిళనాడు.. గోవా.. కేరళ లాంటి రాష్ట్రాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ప్రముఖ ఫుడ్ యాప్ లైన స్విగ్గీ.. జమాటో.. బిగ్ బాస్కెట్ లాంటి వాటితో హోం డెలివరీ చేయించటం ద్వారా అమ్మకాలు పెరగటం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే హోం డెలివరీ చేపట్టిన రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో 20 నుంచి 30 శాతం వరకు అమ్మకాలు పెరిగినట్లుగా గుర్తించారు.
దీంతో.. హోం డెలివరీ యాప్ లతో మద్యం అమ్మకాలు ఖాయంగా పెరుగుతాయని చెబుతున్నారు. ఈ మధ్యన అంతర్జాతీయ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక సర్వే నిర్వహించింది. దీని సారాంవం ఏమంటే.. ఇంటికే మద్యాన్ని సరఫరా చేసే విధానానికి తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున మక్కువ చూపిస్తున్నట్లుగా పేర్కొన్నారు. లిక్కర్ హోం డెలివరీ కారణంగా.. మద్యం షాపుల్లో క్యూ పద్దతి కారణంగా మహిళలు.. పెద్ద వయస్కులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హోం డెలివరీ కారణంగా ఇలాంటి తిప్పలు తప్పుతాయని చెబుతున్నారు. స్విగ్గీ.. జుమాటో తదితర యాప్ ల ద్వారా హోం డెలివరీకి ప్లాన్ చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.