కోరుకున్న తిండి కోసం మరో ఆలోచన లేకుండా మొబైల్ యాప్ ఓపెన్ చేసి ఫుడ్ డెలివరీ యాప్ లలో నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవటం అలవాటుగా మారింది. ఇదెంత ఎక్కువగా ఉందంటే.. చాలామంది ఇళ్లల్లో వంట మార్చేసిన పరిస్థితి. అందుకు తగ్గట్లే.. ఫుడ్ యాప్ ల జోరు అంతకంతకూ పెరుగుతోంది. ఇలా పెరుగుతున్న డిమాండ్ కు తగ్గట్లు.. గుట్టుచప్పుడు కాకుండా సేవల సొమ్ముల్ని పెంచేస్తూ వాతలు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తాజాగా అలాంటి షాకిచ్చేందుకు స్విగ్గీ సిద్ధమైనట్లుగా ప్రచారం సాగుతోంది.
ఆ మధ్యన మొదలు పెట్టిన ప్లాట్ ఫామ్ ఛార్జీలను విపరీతంగా పెంచేసేలా ప్లాన్ చేస్తోంది స్విగ్గీ. అందుకు తగ్గట్లే మొన్నటివరకున్న ఛార్జీలను పెంచేసిన ఈ సంస్థ.. కస్టమర్ల మీద భారం పడకుండా ఉండేందుకు వీలుగా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. ఫుడ్ ఆర్డర్లు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఫ్లాట్ ఫామ్ ఛార్జీలను పెంచటం ద్వారా లాభం పొందేలా ప్లాన్ చేస్తుందని చెప్పాలి. మొన్నటివరకు యూజర్ల నుంచి రూ.3 వసూలు చేసిన స్విగ్గీ ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ.10లకుగా మార్చేసింది.
అయితే.. నొప్పి నేరుగా తగలకుండా ఉండేందుకు కొత్తఎత్తులు వేసినట్లుగా చెబుతున్నారు. బిల్లులో ఫ్లాట్ ఫాం ఛార్జీ కింద రూ.10చూపించి.. అందులో రూ.5 డిస్కౌంట్ అని పేర్కొంటూ.. మొన్నటి వరకు వసూలు చేసిన రూ.3కు బదులుగా రూ.5 వసూలు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి రూ.5 వసూలు చేస్తూనే.. రానున్న రోజుల్లో ఇప్పుడు ఇస్తున్న డిస్కౌంట్లను ఎత్తేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు అయితే.. అలాంటి ఆలోచనలు ఏమీ ప్రస్తుతానికి తమకు లేవని స్విగ్గీ సంస్థ ప్రతినిధులు చెబుతున్నా.. వాస్తవం మాత్రం అందుకు భిన్నమంటున్నారు.
ఈ ఏడాది ఆరంభ రోజున ఆన్ లైన్ ఆర్డర్లు భారీగా ఉన్న నేపథ్యంలో.. స్విగ్గీ మాత్రమే కాదు జొమాటో సైతం ప్లాట్ ఫాం ఛార్జీల్ని వసూలు చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ జనవరి ఒకటిన జొమాటో వినియోగదారులు ఇచ్చిన ఆర్డర్లకు రూ.3 నుంచి రూ.4కు పెంచిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. స్విగ్గీ సైతం కొన్ని ప్రాంతాల్లో రూ.9 వసూలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. మొత్తంగా వినియోగదారులకు షాకిచ్చేందుకు స్విగ్గీ సిద్ధమైనట్లుగా చెబుతున్నారు. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానం చెప్పాల్సి ఉంటుంది.