టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా టీడీపీ నాయకులు చం ద్రబాబు ఏం చెబుతారు? ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? అని ఎదురు చూస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభించిన నిరసన దీక్ష.. శుక్రవారం రాత్రి 8 గంటల వరకు జరగనుంది. మొత్తం 36 గంట ల పాటు చంద్రబాబు దీక్ష చేయనున్నారు. ఈ సమయంలో అంటే.. దీక్ష ప్రారంభించిన సమయంలో చం ద్రబాబు అధికార పార్టీ ఆగడాలు.. డీజీపీ నిర్లిప్తత .. సీఎం జగన్‌పైనా నిప్పులు చెరిగారు.
ముఖ్యమంత్రి జగన్, డీజీపీ.. మీరు చేసింది నేరం. సరిదిద్దుకోలేని తప్పు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఏం చేయాలో చేసి చూపిస్తా. ఖబడ్దార్.. జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు హెచ్చరించారు. ‘తప్పుడు కేసులు పెట్టి, జైలుకు పంపించి.. నాటకాలు ఆడుతున్నారు. మీరు చేసిన చట్టవ్యతిరేక కార్యక్రమాలకు శిక్ష పడేవరకు వదిలిపెట్టను’ అని విరుచుకుపడ్డారు. ‘ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని చూశాం. కానీ ఈ సీఎం ఆలోచనల్లోనే లోపం ఉంది. ఇలాంటి వాళ్లను సరిచేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. టీడీపీ కార్యాలయంపై దాడికి పంపడానికి ఈ డీజీపీకి ఎంత ధైర్యం ఉండాలి? అని చంద్రబాబు ధ్వజమెత్తారు.
పట్టాభి వాడిన భాష తప్పన్నారు.. ముఖ్యమంత్రీ? మీరు వాడిన భాషేంటి? మీ బూతుల మంత్రులు, ఎమ్మెల్యేలు వాడిన భాష ఏంటి? రికార్డులూ ఉన్నాయి. చర్చకు సిద్ధమా? అయిదు కోట్ల మందిని అడుగుదామా? అని సవాల్ రువ్వారు. టీడీపీ కేంద్ర కార్యాలయ గేటును.. కారుతో ఢీకొట్టి లోపలకు వచ్చారు. బీర్లు తాగుతూ వీరంగం సృష్టించారు. దొరికినవాళ్లను దొరికినట్లు కొట్టారు. తర్వాత పోలీసులు వచ్చి వారిని సాగనంపారు. సిగ్గనిపించలేదా? మీకు చేతకాకపోతే పోలీసు వ్యవస్థ మూసేసి ఇంటికి పొండి.. మమ్మల్ని మేం కాపాడుకుంటాం.. అని అన్నారు.
ఈ సమయంలోనే చంద్రబాబు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. దీంతో చంద్రబాబు ఏం చెబుతారు? పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్తారు..? అని పార్టీ నాయకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ముందు రెండు కీలక సమస్యలు ఉన్నాయి. ఒకటి.. పార్టీని వైసీపీకి దీటుగా ముందుకు తీసుకువెళ్లడం.. రెండు.. అధికారంలోకి రావడం. ఈ క్రమంలో ఎదురయ్యే పరిణామాలను దీటుగా ఎదుర్కొనడం.. ఈ విషయాలకు సంబంధించే చంద్రబాబు పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారని అంటున్నారు. అదేసమయంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బస్సు యాత్ర ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో దీక్ష విరమణ సందర్భంగా చంద్రబాబు ఏం చెబుతారనేది ఆసక్తిగా మారింది.