బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్యా? హత్యా ? అన్న విషయంపై కొద్ది నెలలుగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారాన్ని నిగ్గుతేల్చేందుకు రంగంలోకి దిగిన సీబీఐ ముమ్మరంగా విచారణ జరిపింది.
ఈ క్రమంలోనే సుశాంత్ మరణం వ్యవహారంలో తీవ్ర ఆరోపణలలు ఎదుర్కొంటోన్న రియాపై అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత సుశాంత్ మృతి వ్యవహారంలో డ్రగ్స్ కోణం రావడంతో కొందరు బాలీవుడ్ తారల విచారణ కూడా జరిగింది. ఈ క్రమంలోనే సుశాంత్ కేసుకు సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఢిల్లీ ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ల బృందం కీలక ప్రకటన చేసింది.
సుశాంత్ ది హత్య కాదని, ఆత్మహత్యేనని ఆ బృందం తేల్చి చెప్పింది. సుశాంత్ శరీరంలో విషం లేదని గతంలో ప్రకటించిన ఎయిమ్స్ వైద్యులు….తాజాగ ఇచ్చిన మెడికో లీగల్ ఒపీనియన్ లోనూ మరోసారి ఆ విషయాన్ని ధృవీకరించారు. సుశాంత్ గొంతు నులిమి చంపారని వచ్చిన ఆరోపణలను ఈ బృందం ఖండించింది. సుశాంత్ మరణంపై సీబీఐకి తమ మెడికో లీగల్ ఒపీనియన్ ని ఈ బృందం సమర్పించింది.
సుశాంత్ పోస్ట్ మార్టం, అటాప్సీ రిపోర్టులను సమగ్రంగా విశ్లేషించామని ఎయిమ్స్ ఫోరెన్సిక్ డాక్టర్ల బృందం తెలిపింది. ఇది సూసైడ్ కేసేనని, మర్డర్ కేసు కాదని ఘటనా స్థలం వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వెల్లడైందని ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ఢిల్లీ ఎయిమ్స్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కి చెందిన నలుగురు డాక్టర్ల బృందం 45 రోజులపాటు ఈ కేసును ‘ఇన్వెస్టిగేట్’ చేసింది.
ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న ల్యాప్ టాప్, హార్డ్ డ్రైవ్స్, డిజిటల్ కెమెరాల లోని సమాచారాన్ని కూడా ఈ బృందం అధ్యయనం చేసింది.ఉరి వేసుకోవడంవల్ల సుశాంత్ మరణించాడన్న ముంబై కూపర్ ఆసుపత్రి నివేదికతో ఈ బృందం ఏకీభవించింది.
తాజాగా, ఎయిమ్స్ రిపోర్ట్ తో సుశాంత్ కేసును సూసైడ్ కేసు కోణంలో సీబీఐ దర్యాప్తు చేయనుంది. ఆత్మహత్యకు సుశాంత్ ను ఎవరైనా ప్రేరేపించారా లేక సుశాంత్ తనంతట తానే ఆత్మహత్య చేసుకున్నాడా అన్న కోణంలో విచారణ జరపనుంది.