‘అటల్ టన్నెల్’... సైన్యానికి అదనపు బలం

India Oct 03, 2020


గతంలో హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ నుంచి లఢక్ లోని లేహ్‌ వరకు వెళ్లాలంటే రోడ్డు మార్గంలో సాగే ప్రయాణం నరకప్రాయం. రోహతాంగ్‌ పాస్‌ వైపు వెళ్లే లేహ్‌-మనాలీ హైవేపై సాగే ఈ ప్రయాణం  మంచు కురుస్తున్న సమయంలో మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే,  సంవత్సరంలో 4 నెలలపాటే ఈ మార్గం తెరిచి ఉంటుంది.

కాశ్మీరులోని జోజీ లా మీదుగా వెళ్లే శ్రీనగర్‌-ద్రాస్-కార్గిల్‌-లేహ్‌ హైవేపై నుంచి లడక్ కు మరోమార్గం ఉంది. ఇది కూడా సంవత్సరంలో 4 నెలలు మూసి ఉంటుంది. దీంతో, మనాలీ నుంచి లడక్ లోని లేహ్ కు వెళ్లడం ఆ ప్రాంత వాసులకు నరకప్రాయం. అయితే, ఇకపై వారికి ఈ ప్రయాణం నల్లేరు మీద నడక కానుంది.

వారి కష్టాలను తీర్చేందుకు మనాలీ నుంచి లాహోల్‌స్పిటి లోయ వరకు నిర్మించిన `అటల్ టన్నెల్`ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పొడవైన  టన్నెల్‌ ను జాతికి అంకితం చేశారు మోడీ.

ఆ ప్రాంత వాసుల కష్టాలను తీర్చేందుకు రోహతాంగ్‌ పాస్‌ కింద రూ.3,500 కోట్ల ఖర్చుతో... 9.02 కిలోమీటర్ల పొడవుగా ఈ టన్నెల్ ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది.  సముద్ర మట్టానికి 10,213 అడుగుల ఎత్తున ఈ టన్నెల్ ఉంది.

ఈ టన్నెల్‌ 8 మీటర్ల వెడల్పు, 5.525 మీటర్ల ఎత్తు కలిగి ఉండగా...లోపల రెండు వరుసల హైవే ఉంది. ఆస్ట్రియా టన్నెలింగ్‌ విధానంలో గుర్రపు నాడా ఆకారంలో నిర్మించిన ఈ టన్నెల్ ద్వారా మనాలీ నుంచి లఢక్ లోని లేహ్‌ వరకు ఉన్న ప్రయాణ సమయంలో 7 గంటలు ఆదా చేయవచ్చు. దీంతో పాటు, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.

సొరంగ మార్గంలో మంచు కురుస్తుందన్న భయంలేకుండా సంవత్సరం పొడవునా ఈ టన్నెల్ ద్వారా ప్రయాణించవచ్చు. లఢక్, అక్సాయ్‌ చిన్‌ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఈ టన్నెల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి ఆలోచనలలోనుంచి పురుడుపోసుకున్న ఈ టన్నెల్ కు 2002 మే 26న శంకుస్థాపన జరిగింది. గత ఏడాది డిసెంబరులో వాజపేయి 95వ జయంతి సందర్భంగా దీనికి ‘అటల్‌ టన్నెల్‌’ అని పేరు పెట్టారు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.