డబ్బుతో సర్వే సంస్థలను కొనేసే సీఎం వైఎస్ జగన్ కు తొలిసారి చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. వైసీపీ రెండోసారీ విజయదుందుభి మోగిస్తుందంటూ నివేదికలు ఇవ్వాలని తన సన్నిహిత ఆంగ్ల మీడియా సంస్థలను ఆయన కోరగా.. అవి నిరాకరించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నవ్యాంధ్రలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండడం.. తాజాగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని వెల్లడి కావడంతో జగన్‌కు భయం పట్టుకుందని అంటున్నారు.
వాస్తవానికి ఆయన తన ‘ఇమేజ్’ పెంచుకోవడానికి 25 కోట్లు పెట్టి ‘టైమ్స్’ నెట్‌వర్క్‌తో ఏనాడో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ‘టైమ్స్ నౌ – ఈటీజీ’ రాష్ట్రంలో సర్వేచేసింది. నిరుడు ఏప్రిల్‌లో దాని ఫలితాలు ప్రకటించింది. దాని ఆధారంగా అదే నెల 22న జగన్ మీడియా ‘ఏపీలో వైస్సార్సీపీ క్లీన్ స్వీప్… ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24-25 ఎంపీ స్థానాలు ఖాయం’… అని పతాక శీర్షికలో వార్త ప్రచురించింది. రాష్ట్రంలో 25 లోక్‌సభ స్థానాలుంటే మొత్తం గెలవడమంటే… అసెంబ్లీ స్థానాల్లో భారీ విజయమేనన్న మాట.
అయితే ఈ ‘సర్వే’ తెరవెనుక సంగతి తెలుసుకుని రాజకీయ నాయకులు, విశ్లేషకులు అవాక్కయ్యారు. ఒకవైపు జగన్ ప్రభుత్వంపట్ల రోజురోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. ఎమ్మెల్యేలను జనం ముఖాన్నే కడిగేస్తున్నారు. అలాంటిది… ఇప్పుడున్న 22 ఎంపీ సీట్లకంటే ఇంకా ఒకటి రెండు పెరగడం ఎలా సాధ్యం! ఆరా తీస్తే ఈ 25 సీట్ల వెనుక… రూ.25కోట్ల కథ ఉన్నట్లు తేలింది. ‘మీకు మేం డబ్బులిస్తాం. మీరు మా ఇమేజ్ పెంచండి’.. అంటూ టైమ్స్ నెట్‌వర్క్‌తో జగన్ ఒప్పందం చేసుకుంది. అంటే… ఇదోరకం ‘క్విడ్ ప్రో కో’ అన్నమాట! ఇందులో భాగంగా మూడేళ్లలో జగన్ సర్కారు ఇప్పుడు సర్వే చేసిన ‘టైమ్స్ నౌ’ మాతృసంస్థ ‘బెనెట్ కోల్మన్ అండ్ కో’కు దాదాపు రూ.25 కోట్లు సమర్పించుకున్నట్లు తెలుస్తోంది.
ఏమిటీ ఒప్పందం…
జగన్ సర్కారు టీడీపీ పథకాలనే పేరు, తీరు మార్చి అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయా పథకాలకు ఎప్పటికప్పుడు నిధులు అందేవి. కానీ ఈయన సర్కారు ఒకే పథకానికి పలుమార్లు నిధులు విడుదల చేస్తూ… బటన్ నొక్కిన ప్రతిసారీ సొంత, అనుకూల మీడియాకు కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు జారీ చేస్తోంది. ఇలా సొంత మీడియాకే వందల కోట్లు కట్టబెట్టింది. స్థానికంగా ఎంపిక చేసిన పత్రికలతోపాటు జాతీయ స్థాయి పత్రికలు, వెబ్సైట్లకూ కోట్ల విలువైన ప్రకటనలు ఇస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే… ‘టైమ్స్ నెట్వర్క్’ మాతృ సంస్థ ‘బెనెట్ కోల్మన్’తో కుదిరిన ఒప్పందం ఒక ఎత్తు!
రాష్ట్ర ప్రభుత్వంతోపాటు నాయకుల ఇమేజ్ను ‘జాతీయ స్థాయి’లో పెంచేసి… ఇక్కడ అమలు చేస్తున్న విధానాలు, పథకాలపై దేశ ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకు ఏటా టైమ్స్ నెట్‌వర్క్‌కు రూ.8.15 కోట్ల చొప్పున ఇచ్చేందుకు సర్కారు అంగీకరించింది. ఇది ఎప్పటికప్పుడు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనల డబ్బులకు అదనంగా ఇచ్చిన సొమ్ము. దీనిపై 2020 అక్టోబరు 28వ తేదీన ప్రభుత్వం జీవో 1692 కూడా విడుదల చేసింది. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది. ఆ తర్వాత మరో రెండేళ్లు గడిచిపోయాయి. ఆ రెండేళ్లు కూడా ఈ ఒప్పందం అమలైంది.
ఎందుకంటే.. ప్రభుత్వం అన్ని జీవోలను రహస్యంగానే జారీ చేస్తోంది. ప్రజలకు తెలియకుండా అత్యంత గోప్యత పాటిస్తోంది. వెరసి… ఏటా రూ.8.15 కోట్ల చొప్పున మూడేళ్లలో దాదాపు రూ.25కోట్లు సమర్పించుకున్నందుకు ప్రతిఫలంగా… ఇలా క్లీన్‌స్వీప్ సర్వే వెలువడినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నాలుగేళ్లలో ప్రకటనలతో కలిపి టైమ్స్ నెట్‌వర్క్‌కు జగన్ సర్కారు రూ.వంద కోట్ల దాకా చెల్లించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
‘ఇమేజ్ పెంచుకోవడం’ ఏమిటో…
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాల గురించి రాష్ట్ర ప్రజలకు తెలిస్తే చాలు! వారికి అవగాహన కల్పిస్తే సరిపోతుంది. ఎందుకంటే… పథకాలు, విధానాల ఫలాలను అనుభవించేది రాష్ట్ర ప్రజలే! దీనికోసం జగన్ సర్కారు ఇబ్బడి ముబ్బడిగా ప్రకటనలు జారీ చేస్తూనే ఉంది. కానీ… జాతీయ స్థాయిలో వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఏమిటి? నిజంగా మన పథకాలు అంత గొప్పవైనప్పుడు జాతీయ స్థాయి మీడియానే ఇటువైపు చూస్తుంది. ఇతర రాష్ట్రాల నాయకులు వచ్చి స్వయంగా పరిశీలిస్తారు. గతంలో ఎన్టీఆర్ సర్కారు బలహీనవర్గాలకు ఇళ్ల పథకం, రెండు రూపాయలకు కిలోబియ్యం పథకం ప్రవేశపెట్టినప్పుడు జాతీయ స్థాయిలో సంచలనమైంది.
జాతీయ మీడియా వీటి గురించి వివరించింది. ఇలాంటి పథకాలనే ఇతర రాష్ట్రాలూ అమలు చేశాయి. తమిళనాడులో జయలలిత ప్రవేశపెట్టిన ‘అమ్మ క్యాంటీన్’లూ ఇదేస్థాయిలో ఆదరణ పొందాయి. కానీ… డబ్బులు ఇచ్చి ‘ఇమేజ్’ పెంచుకోవడమేమిటో! ఇది పక్కనపెడితే.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీయే భారీ విజయం సాధించబోతోందని రెండు తాజా సర్వేలు వెల్లడించాయి. దీంతో జగన్‌లో ఆందోళన కనిపిస్తోందని అంటున్నారు. వాస్తవానికి ఆయన డిసెంబరులోనే టైమ్స్, అదానీ నేతృత్వంలోని ఎన్డీటీవీని, ఇటీవల తన విద్యావిధానం ప్రచారం కోసం ఒప్పందం చేసుకున్న ఇండియాటుడే నెట్‌వర్క్‌ను సంప్రదించినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులను ముందుగానే అంచనా వేసిన ఆయా సంస్థలు అనుకూల సర్వేలకు నిరాకరించాయి. ఎంత డబ్బు ఇవ్వజూపినా.. ససేమిరా అన్నట్లు వైసీపీ ముఖ్య నేతలు కూడా ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరించారు. పైగా అప్పటికే టీడీపీ-జనసేనతో బీజేపీ పొత్తు ఉంటుందని ఢిల్లీ వర్గాలన్నిటికీ తెలుసు. అందుకే ఎన్డీయేకి వ్యతిరేకంగా సర్వే ఫలితాలిచ్చేందుకు ఆయా సంస్థలు అంగీకరించలేదని తెలిసింది.
ఏపీలో ఎన్డీయే ఊపు..
రాష్ట్రంలో పార్టీల విజయావకాశాలపై సీ-వోటర్ సంస్థతో కలిసి ఏబీపీ చానల్ ఇటీవల ఓ సర్వే నిర్వహించగా.. నెట్వర్క్18 (న్యూస్18) మెగా ఒపీనియన్ పోల్ జరిపింది. సీ-వోటర్-ఏబీపీ చానల్ సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో టీడీపీ కూటమి 20 సీట్లు గెలుచుకోనుంది. వైసీపీకి 5 సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. టీడీపీ కూటమికి 44.7 శాతం ఓట్లు.. వైసీపీకి 41.9 శాతం ఓట్లు.. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమికి మూడు శాతం ఓట్లు వస్తాయని విశ్లేషించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 10వ తేదీ మధ్యలో ఈ సర్వే జరిగింది. టీడీపీ-జనసేన కూటమి, బీజేపీ మధ్య మార్చి మొదటివారంలో పొత్తు ఖరారైన విషయం తెలిసిందే.
నెట్వర్క్ 18 సర్వే కూడా టీడీపీ కూటమికి ఘన విజయం దక్కబోతోందని అంచనా వేసింది. ఈ కూటమికి ఏకంగా 50 శాతం ఓట్లు లభిస్తాయని తెలిపింది. వైసీపీకి 41 శాతం ఓట్లు, కాంగ్రెస్ కూటమికి ఆరు శాతం ఓట్లు, ఇతరులకు మూడు శాతం రావచ్చని అంచనా వేసింది. ఈ ప్రకారం టీడీపీ కూటమికి 18 ఎంపీ సీట్లు, వైసీపీకి ఏడు వస్తాయని వివరించింది. కాంగ్రెస్ సహా మిగిలిన పార్టీలకు ఒక్క సీటు కూడా రాదని పేర్కొంది. ఈ రెండు సర్వేల్లో ప్రజాభిప్రాయం ఇంచుమించుగా ఒకే విధంగా ఉండడం విశేషం. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత బలంగా ఉండడం వల్లే టీడీపీ కూటమి ఘన విజయం దిశగా వెళ్తోందని విశ్లేషించాయి. మార్చి 14వ తేదీన వెల్లడైన ఈ ఫలితాలు పాలక వైసీపీకి మింగుడుపడడం లేదు.