ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జగ్గం పేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచ లన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వైసీపీలో టికెట్ల రగడ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సర్వేలు.. ప్రజల అభిప్రాయాలు, ఐప్యాక్ నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలను మారుస్తున్న నేపథ్యంలోచాలా మంది సిట్టింగులకు టికెట్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ దక్కని వారిని పార్టీ బుజ్జగిస్తోంది.
అయితే..ఈ జాబితాలో చంటిబాబు కూడా ఉన్నారు. ఈయనకు కూడా పార్టీ టికెట్ ఇవ్వనని చెప్పేసింది. ఈయన స్థానంలో మాజీ ఎంపీ తోట నరసింహానికి టికెట్ ఖరారు చేసింది. ఈ నిర్ణయంపై అలిగిన చంటిబాబు.. జనసేనలో చేరుతున్నారనే వాదన వినిపించింది. ఇదిలావుంటే.. ఆయన శుక్రవారం రాత్రి 10 గంటల తర్వాత.. తూర్పులోనే ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో అత్యంత రహస్యంగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో టికెట్ ఇస్తే.. వచ్చేస్తానని ఆఫర్ ఇచ్చినట్టు తూర్పు రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది.
ఇక, తాజాగా తన అనుచరులతో జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు. అంతర్గత సంభాషణలో పవన్ కల్యాణ్ పిలిచారని.. తాను వెళ్లానని చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఏమీ లేదని ఆయన అన్నా.. టికెట్ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇదిలావుంటే.. జిల్లా రాజకీయాల గురించి అడిగి తెలుసుకున్నారని వివరించారు.
ఇక, వైసీపీ టికెట్ల వ్యవహారంపై జ్యోతుల స్పందిస్తూ. సర్వేల ద్వారా ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వడానికి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు చేసింది ఏమీ లేదన్నారు. అంతా ప్రభుత్వ పరంగా చేసినవేనని చంటిబాబు అన్నారు. ఏదైనా సర్వే చేయాలని అనుకుంటే.. అది నేరుగా సీఎం జగన్‌పైనే చేయాలన్నారు. ఎందుకంటే.. బటన్ నొక్కింది.. నిర్ణయాలు తీసుకున్నది కూడా ఆయనేనని చెప్పారు. ఆ సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకుంటే.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదని హాట్ వ్యాఖ్యలు చేశారు.