అమరావతి ప్రాంతంలోని ఆర్-5 జోన్ లో జగనన్న ఇళ్ల కోసం స్థలాలు కేటాయించడంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వాటిపై తాజాగా విచారణ జరిపిన సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
హైకోర్టులో పెండింగ్లో ఉన్న రిట్ పిటిషన్ తుది తీర్పునకు లోబడే పట్టాల చెల్లుబాటు ఉంటుందని క్లారిటీనిచ్చింది. పట్టాదారులకు థర్డ్ పార్టీ హక్కు ఉండబోదని స్పష్టం చేసింది.
విచారణ సందర్భంగా రైతులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆర్-5 జోన్లో ఇప్పటికే ప్లాట్ల కేటాయింపులు జరిగాయని ప్రభుత్వం, సీఆర్డీఏ తరఫు న్యాయవాదులు వాదించారు. దీంతో, ప్లాట్ల కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేయబోమని సుప్రీం వ్యాఖ్యానించింది. కానీ, 3 రాజధానులపై హైకోర్టు రిట్ పిటిషన్ తీర్పునకు లోబడే పట్టాలు ఉంటాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు వేలాది ఎకరాల భూమి ఇచ్చారని సుప్రీంకోర్టుకు రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఎలాంటి ఆర్థిక పరిహారం తీసుకోకుండా భూములు ఇచ్చారని చెప్పారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధిపై అధికారులు ప్రచారం చేశారని వాదించారు.
కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.జులైలో తుది విచారణ ఉంటుందని, కానీ అంతకుముందే పట్టాలు ఇస్తే ఏముంటుందని ప్రశ్నించారు.