వైసీపీ నాయకుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.. అరెస్టు వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయనను తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. అదేసమయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. అసలు ఈ కేసు ఏంటి? ఎందుకు మిథున్‌రెడ్డిని చేర్చాల్సి వచ్చింది? రాజకీయ ప్రేరేపితం కాదనడానికి.. కారణాలేంటి? అనే విషయాలను అఫిడవిట్ రూపంలో తమకు ఇవ్వాలని కోరింది.
కాగా.. వైసీపీ హయాంలో లిక్కర్ స్కాం జరిగిందని.. తమ అనుకూల కంపెనీల ద్వారా లిక్కర్‌ను తయారు చేయించి.. ఎక్కువ ధరలకు విక్రయించి సొమ్ములు చేసుకున్నారని.. ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై సిట్‌ను కూడా నియమించింది. విజయవాడ పోలీసు కమిషనర్ ఆధ్వర్యంలో దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందం దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఎంపి మిథున్‌రెడ్డి కూడా లిక్కర్ బేవరేజెస్ ద్వారాఅనధికారికంగా సర్కారుకు మద్యాన్ని విక్రయించారని పోలీసులు చెబుతున్నారు.
దీంతో తనను అరెస్టు చేసేందుకు అవకాశం ఉందని తొలుత మిథున్రెడ్డిరాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థించారు. అయితే.. ఈ సందర్భంగా పోలీసులు.. అసలు మిథున్‌రెడ్డి పేరును ఎక్కడా పేర్కొనలేదని.. కేవలం ఆయనను విచారించడం ద్వారా అసలు ఏం జరిగిందన్న విషయాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. దీంతో హైకోర్టు ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చుతూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో మిథున్రెడ్డిసుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ కువచ్చింది. రికార్డుల్లో పేరు లేరంటూ.. పోలీసులు చేసిన వాదనను పక్కన పెట్టిన సుప్రీంకోర్టు పిటిషనర్ ఒక నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడు అన్న విషయాన్ని గుర్తు చేసింది. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని సూచించింది. తాము తుది ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎలాంటి అరెస్టులు చేయకుండా రక్షణ కల్పిస్తున్నామని పేర్కొంది. ఇదేసమయంలో ప్రభుత్వం దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.